హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న టీఏలు, డీఏలు, సరెండర్స్ ఎప్పుడిస్తారో చెప్పాలని పోలీసులు డీజీపీ జితేందర్ను కోరారు. తమ ఆరోగ్య భద్రతకు భరోసా లేకుండా పోయిందని, నెట్వర్క్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల భద్రతకు సంబంధించి మంగళవారం డీజీపీ కార్యాలయంలో వార్షిక సమావేశం జరిగింది. అన్ని యూనిట్లు, విభాగాల సభ్యులు ఈ సమావేశానికి హాజరై పోలీసుల సమస్యలను డీజీపీకి ఏకరువు పెట్టారు. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాలకు లోన్లు పెట్టుకున్నా సరైన సమయానికి రావడం లేదని, ఆరోగ్య భద్రత పథకం కింద పోలీసులను నెట్వర్క్ ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై పోలీసుల్లోనే వ్యతిరేకత వస్తుందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ తగినంత బడ్జెట్ లేకపోవడమే ఈ సమస్యలకు కారణమని, సీనియార్టీ ప్రకారం లోన్లు ఇస్తున్నామని చెప్పినట్టు సమాచారం.