దామరగిద్ద, ఆగస్టు 7 : కర్షకులపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తిలో దీక్షలు చేపట్టి అక్కడి నుంచి దామరగిద్ద వరకు పాదయాత్ర ప్రారంభించారు.
గడిమున్కన్పల్లి సమీపంలోని రైస్‌మిల్లు వద్ద భోజనం చేసి వెళ్తుండగా పోలీసులు రైతులను అడ్డుకున్నారు. అయినప్పటికీ రైతులు వెనుకడుగు వేయకుండా పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేస్తూ దామరగిద్ద వరకు పాదయాత్ర చేపట్టారు.
అనంతరం తహసీల్దార్ తిరుపతయ్యకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కానుకుర్తిలో రైతులు నిర్వహించిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడు తూ.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో రైతులు 720 ఎకరాలు కోల్పోతున్నారని, వారికి ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజేందర్‌రెడ్డి ఎదుట మహిళా రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం పరిహారం తక్కువగా ఇస్తుందని, దీంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని వాపోయారు.