ధర్మసాగర్, మార్చి 6 : హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం లో బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసుల దాడి చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జాకీపురానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కుర్సుపెల్లి రమేశ్ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో ‘దొంగలు ఉన్నారు జాగ్రత్త’ అనే ఫొటోను పోస్టు చేశాడు. మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గట్టు మల్లికార్జునస్వామి దేవాలయానికి రాగా కాంగ్రెస్ నాయకులు కలిశారు. టెంట్పైన ‘పోలీసులు దొంగలు ఉన్నారు. జాగ్రత్త’ అనే బ్యానర్ కట్టారు. దీనిని రౌండ్ చేసి రమేశ్ జానకీపురంలో ‘రాజకీయ పార్టీల దొంగలు ఉన్నారు.. జాగ్రత్త’ అని గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. దీంతో రాజిరెడ్డి అనే వ్యక్తి కుర్సుపెల్లి రమేశ్‌పై ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రమేశ్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య స్పందిస్తూ, రమేశ్‌ను కొట్టిన సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై జానీపాషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కడియం శ్రీహరి మెప్పు కోసమే బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టిన తీరును ఖండిస్తూ, సీపీ, డీఐజీ, ఐజీలను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.