బండి వ్యవహారంలో చేతులకు అంటిన బురదను కడిగేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అష్టకష్టాలు పడుతున్నరు. పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడిని తానేమీ రక్షించలేదని చెప్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నరు. కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడో లేక బీజేపీతో తన బంధం బయటపడిందన్న భావనో తెలీదుకానీ.. బండి భగీరథ్ అరెస్టు విషయంలో తానేదో చిత్తశుద్ధితో ప్రయత్నించినట్టు చెప్పుకొనేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నరు. వారం రోజులుగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడిన ప్రతి సందర్భంలో బండి ఇష్యూపై స్పందించారు. అయితే రేవంత్ ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడారు. అందరినీ గందరగోళానికి గురిచేయడం కోసమే అలా మాట్లాడారా? లేక తీవ్ర ఆత్మరక్షణలో పడి అందులోనుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతున్నారా?
ఈ నెల పదో తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిండు. మేం అక్కడికి వెళ్లాలి? ప్రధానమంత్రికి 9, 10 తారీఖుల్లో పది వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించాల్సి వచ్చింది. మోదీ ఒకటి కాదు.. ఆరు ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు. పరేడ్‌గ్రౌండ్‌లో పబ్లిక్ మీటింగ్‌కు వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు నాలుగురోజులు కంటిన్యూగా పదివేల మంది పోలీసులను అక్కడే మోహరించాల్సి వచ్చింది. అందుకే 11వ తేదీన పొద్దున్నే సెక్షన్లను మార్చి, వాళ్ల ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చినం.
– ఓ మీడియా కాంక్లేవ్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో బండి భగీరథ్ సరెండర్ కాలేదని, ఆయన్ను పోలీసులు నడిరోడ్డుపై అరెస్ట్ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. అప్పా జంక్షన్ వద్ద నాకాబందీ తనిఖీల్లో పట్టుబడినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పోక్సో కేసులో భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక కేంద్ర మంత్రి చెబుతున్నట్టు ఆయనే తన కొడుకును అప్పగించారా? ఏది నిజమని విలేకరులు ప్రశ్నించారు. సీఎం స్పందిస్తూ ‘మా పోలీసులు చెప్పిందే నేను నమ్ముతున్నా. ఒకవేళ సరెండర్ చేస్తే కొడుకుని ఇంట్లో పెట్టుకొని వాళ్లే అప్పగిస్తారు కదా. అప్పా జంక్షన్ నా ఇల్లా నీ ఇల్లా, అక్కడ నాకాబందీ చేసి వెహికిల్స్ చెక్ చేస్తున్నప్పుడు భగీరథ్ పోలీసులకు చిక్కాడు.
మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు.. మీరొచ్చి తీసుకెళ్లండి అంటే సరెండర్ అవుతుంది’ అని చెప్పారు. అయితే భగీరథ్‌ను ఆయన తండ్రి దగ్గరుండి పంపించొచ్చు అని పేర్కొన్నారు. ఐదు రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు తండ్రీకొడుకులు ఒకే చోట ఉన్నారా? లేరా? అనేది ప్రస్తావన కాదని కొట్టిపారేశారు. ఈ కేసులో ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెళ్లిందని, ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. భగీరథ్‌కు పోలీసులు నోటిసులిస్తే వాళ్లు కొంత సమయం అడిగారని తెలిపారు. అయితే అంతకుముందే కరీంనగర్లో ఈ వివాదంపై కేసు నమోదైందని, ఆ ఫిర్యాదులో ఆ అమ్మాయి మైనర్ కాదని పేర్కొన్నట్టు తెలిపారు. కానీ ఆ అమ్మాయి చదివిన స్కూల్, పుట్టిన దవాఖాన, ఆధార్ వివరాల ఆధారంగా మైనరే అని నిర్ధారించుకున్నట్టు చెప్పారు. ఇక చివరగా భగీరథ్ వివాదం రాష్ట్రంలో ఒక మేజర్ ఇన్సిడెంట్ అని సీఎం అంగీకరించారు.