అశ్వాపురం/సారపాక, సెప్టెంబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు శనివారం బస్సులో వెళ్తున్న పౌరహక్కుల సంఘం నేతలను మణుగూరు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ నెల 5న గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై నిజనిర్ధారణ చేపట్టేందుకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణతోపాటు మరో 14 మంది ఘటనా స్థలం వద్దకు వెళ్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అక్కడికి వెళ్లనీయకుండా మణుగూరులో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మణుగూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మీడియాకు విషయం తెలియడంతో అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.
అనంతరం కొత్తగూడెం వైపు తీసుకెళ్లారు. వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించిన మీడియాకు.. వివరాలు చెప్పేందుకు సీఐ అశోక్‌రెడ్డి నిరాకరించారు. వీరి నిర్బంధాన్ని ప్రజాఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, కోకన్వీనర్ మంతెన సంజీవరావు ఒక ప్రకటనలో ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.