రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ సందడిలో తలమునకలై ఉండగా.. చడీచప్పుడు లేకుండా ముగ్గురు సీనియర్ పాత్రికేయులను రేవంత్ సర్కార్ నిర్బంధించింది. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్తున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్‌ను విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.
సీనియర్ పాత్రికేయులు చారి, దళిత జర్నలిస్ట్ సుధీర్‌ను పోలీసులు ఇంట్లోకి చొరబడి పట్టుకెళ్లారు. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్టు
ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి భీతావహ వాతావరణం సృష్టించారు.
రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్య్రపు హక్కు పరిధిలో పనిచేసే మీడియాకు స్వయం ప్రకటిత, స్వీయ నియంత్రణ, లక్ష్మణ రేఖలున్నాయి. ఆ గీతదాటి వార్తలు వేయడం తప్పే కావచ్చు. కానీ ఆ తప్పును సరిదిద్దుకునే బాధ్యతను కూడా వ్యవస్థ మీడియాపైనే పెట్టింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఒక వేళ మీడియాను సర్కార్ తప్పుబట్టాలనుకుంటే అందుకు కూడా చట్టబద్ధమైన పద్ధతులున్నాయి. వాటిని పాటించాల్సిన ప్రభుత్వమే తుంగలో తొక్కితే?
తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే.. మరి తెర వెనుక ఉండి ఆ తప్పు చేయించిన వారిపై? తప్పుచేసేలా ప్రేరేపించిన వారి సంగతి?
మహిళా అధికారులపై, ఆ మాటకొస్తే మాతృమూర్తి వంటి ఏ మహిళపై అయినా అసభ్య కథనాలను ఎవరూ ఆమోదించరు. అయితే ఇప్పుడు చట్టం కొరడా పట్టుకున్న ప్రభుత్వం గతంలో ఏం చేసింది? చట్టం ఎవరికైనా చట్టమే కదా! కేటీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా బురద చల్లినప్పుడు, తప్పుడు సంబంధాలు అంటగట్టి వార్తలు రాయించినప్పుడు, వ్యాఖ్యలు చేయించినప్పుడు, బీఆర్ఎస్ మహిళా నేతలపై విషం చిమ్మినప్పుడు, సోషల్ మీడియా మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది?
ఏ సిట్ వేసింది? ఎవరిని అరెస్ట్ చేసింది? చట్టం ఒక్కొక్కరికి ఒక్కోతీరు ఉంటుందా?
పెద్దల ఆధిపత్య కుమ్ములాటలు జర్నలిస్టులపాలిట జలగలయ్యాయి. ‘మేం చెప్పింది విని రాసినంతసేపే మీరు మాకు మిత్రులు. అనంతర పరిణామాలకు మీరే బాధ్యులు’ అన్న పాలసీని కాంగ్రెస్ సర్కార్ బాహాటంగా ఆచరించి చూపింది. తెర వెనుక పావులు కదిపిన వారు ఎవరో తెలిసి కూడా జర్నలిస్టులను బలిపశువులను చేయడం ఏం నీతి?
చేసిందంతా చేసి ఇదేదో జర్నలిస్టులు, బ్యూరోక్రాట్ల మధ్య యుద్ధంగా మలచడానికి మరో కుతంత్రం సాగుతున్నది. తస్మాత్ జాగ్రత్త ! ఈ మొత్తం వివాదంలో అసలు దోషి కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారులు, జర్నలిస్టులు ఇద్దరూ బాధితులే!
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భోగి పండుగ రోజు జర్నలిస్టుల అరెస్టులు రాజకీయంగా పెనుదుమారం కలిగించాయి. అర్ధరాత్రి వేళ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేంటని పోలీసుల చర్యను ప్రజాసంఘాలు తప్పుబట్టాయి. ప్రముఖ చానల్ ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు సంబంధించి విచారిస్తామంటూ చానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఎలా ఉంటే అలాగే పోలీసులు తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి ఎన్టీవీలో పనిచేస్తున్న తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, సీనియర్ రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్‌ను అరెస్ట్ చేశారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల ఐఏఎస్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్త ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 75, 78, 79, 351(1), 352(2) సెక్షన్ల కింద ఈ నెల 10న సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుతోపాటు నారాయణపేటలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాట్సాప్‌లో మెస్సేజ్ పెట్టిన వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ కోసం డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఐఏఎస్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్త ప్రసారం చేశారంటూ ఈ కేసు విషయంలో విచారించాలని ఎన్టీవీకి చెందిన ముగ్గురు రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారితే భోగి పండుగ నేపథ్యంలో పండుగ సెలబ్రేషన్స్ కోసం కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దొంతు రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము విచారణకు రమ్మంటే రాకుండా పారిపోతున్నారంటూ ఆయనను వెంట తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు. అయితే తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగిన రమేశ్‌కు ఏమీ సమాధానం చెప్పకుండానే తమతో వచ్చేయాలంటూ చెప్పిన పోలీసులు బషీర్‌బాగ్ సీసీఎస్‌కు తరలించారు. అదే సమయానికి పరిపూర్ణాచారిని, జర్నలిస్ట్ సుధీర్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారి ఇండ్ల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి తలుపులు బాదడం, వెంటనే ఆ జర్నలిస్టులను వెంట తీసుకెళ్లడంతో వారి కుటుంబాల్లో ఆందోళన కలిగింది. వారిని ఎందుకు తీసుకెళ్తున్నారంటూ అడిగిన జర్నలిస్టుల కుటుంబసభ్యులకు పోలీసులు ఎలాంటి సమాధానమివ్వలేదని తెలిసింది. అయితే తమను ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారంటూ అడిగిన రిపోర్టర్లకు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. సీసీఎస్ కార్యాలయానికి తరలించిన తర్వాత వారిని కలువడానికి ఎవరినీ అనుమతించలేదు. వారితో మాట్లాడే అవకాశం కూడా జర్నలిస్టు ప్రతినిధులకు ఇవ్వలేదు. దీంతో మీడియా, సోషల్‌మీడియాలో జర్నలిస్టుల అరెస్ట్‌పై తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున చర్చ జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నేరుగా డీజీపీ శివధర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండించారు. ఉగ్రవాదుల మాదిరిగా వాళ్లను తీసుకెళ్లడం కరెక్ట్ కాదని, విచారణకు రమ్మంటే వస్తారని చెప్పారు. జర్నలిస్టుల అరెస్ట్‌కు సంబంధించి ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిసింది. అరెస్ట్ చేసిన ముగ్గురిని బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా నడుమ విచారణ కొనసాగింది.
15గంటల పాటు సీసీఎస్‌లోనే!
ఎన్టీవీలో ప్రసారమైన వార్తపై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అదేరోజు రాత్రి ఎన్టీవీ యాజమాన్యం తమ వార్తా ప్రసారం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించింది. సమస్య అక్కడితో అయిపోతుందని అందరూ భావించారు. కానీ అర్ధరాత్రి హఠాత్తుగా పోలీసులు ఒకేసారి ముగ్గురు రిపోర్టర్లు, సీఈవో, యాంకర్‌ను అరెస్ట్ చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో దొంతు రమేశ్‌ను ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేయగా, పరిపూర్ణాచారి, సుధీర్‌ను వారి ఇండ్ల నుంచి పట్టుకెళ్లారు. యాంకర్ ఇంటికి కూడా వెళ్లి హడావుడి చేసి, తిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఇదే సమయంలో సీఈవో ఇంటికివెళ్లి ఆయన కుటుంబసభ్యులను కూడా బెదిరిస్తూ ఆయన గురించి ఆరా తీశారని సమాచారం. సంక్రాంతి పండుగ వేళ జర్నలిస్టుల ఇండ్లకు వెళ్లి అరెస్ట్‌కు సంబంధించి నోటీసులు ఇవ్వకుండానే ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పౌరసంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్ట్ చేసిన ముగ్గురు జర్నలిస్టులను సీసీఎస్‌లో సిట్ బృందం విచారించింది.
ఇందులో భాగంగా వార్తకు సంబంధించి ఎక్కడినుంచి ఇన్పుట్స్ వచ్చాయనే దిశగా ఆరా తీసినట్టు సమాచారం. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు జర్నలిస్టులను సీసీఎస్‌లోనే ఉంచి, పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. సుమారు పదిహేను గంటలపాటు సీసీఎస్‌లోనే జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్టుల అరెస్ట్ తర్వాత వారిని విచారించిన సిట్ బృందం… పరిపూర్ణాచారిని ఇంటికి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో ఆయన ప్రైవేట్ వాహనంలో వెళ్లిపోయారు. తాము ఎప్పుడు పిలిచినా మళ్లీ రావాలని చారికి పోలీసులు చెప్పారు. వార్త ప్రసారమైన సమయంలో ఆయన శబరిమలలో ఉండడంతో పరిపూర్ణాచారిని వదిలేసినట్టు తెలిసింది. మరో ఇద్దరు రిపోర్టర్లు దొంతు రమేశ్, సుధీర్‌కు కింగ్‌కోఠి దవాఖానలో వైద్యపరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. తాము న్యాయస్థానంలోనే కేసును ఎదుర్కొంటామని, తమపై అక్రమంగా కేసులు పెట్టారని జర్నలిస్టు దొంతు రమేశ్ చెప్పారు. తమకు సంబంధం లేకున్నా కేసులు పెట్టారని సుధీర్ తెలిపారు.
ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు!
ఒకవైపు జర్నలిస్టుల అరెస్టులపై హైదరాబాద్‌లో పలు ప్రజా, జర్నలిస్టు సంఘాల ఆందోళనలు కొనసాగుతుండగానే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లోని ఎన్టీవీ కార్యాలయానికి వెళ్లిన సీసీఎస్ బృందం.. బుధవారం ఒక్కరోజే రెండుసార్లు తనిఖీలు నిర్వహించారు. సుమారు ఐదుగంటలపాటు ఎన్టీవీ కార్యాలయంలో హడావుడి చేశారు. మొదట మఫ్టీలో వెళ్లిన పోలీసులు ఆఫీసులోకి వెళ్తున్నప్పుడు తమను అడ్డుకున్న సెక్యూరిటీకి తాము పోలీసులమంటూ చెప్పి లోపలకు వెళ్లి, అన్ని డెస్క్‌లను పరిశీలించారు. పోలీసుల హడావుడి చూసిన డెస్క్ జర్నలిస్టులు భయాందోళనలకు గురయ్యారు. మీరు ఎందుకు వచ్చారని సిబ్బంది అడగడంతో వారు ఆ రిపోర్టర్లు వాడిన కంప్యూటర్లు చూపించమని ఒకవేళ మీరు చూపించకపోతే అక్కడున్న అన్ని సిస్టమ్స్ తీసుకెళ్తామంటూ బెదిరించారు. వార్త ఎలా ప్రసారం అవుతుందో వివరాలు తెలుసుకున్నారు.
న్యూస్‌రూమ్‌లోకి వచ్చి దౌర్జన్యంగా అక్కడున్న వాటిని పరిశీలించడంపై సిబ్బంది పలుసార్లు అభ్యంతరం చెప్పా రు. కంప్యూటర్స్, సర్వర్రూమ్ను సీజ్ చేస్తామని బెదిరించిన పోలీసులు, సర్వర్లను తీసుకుపోదామంటూ ఉద్యోగుల ఎదుట మాట్లాడటంతో అందరూ అవాక్కయ్యారు. ఎడిటర్ ఎక్కడున్నారని, చెప్పకుంటే మిమ్మల్ని అందరినీ తీసుకుపోవాల్సి వస్తుందని దబాయించారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా నేరుగా ఒక చానల్ కార్యాలయంలోకి వెళ్లి హడావుడి చేయడమేంటని చానల్ సిబ్బంది ప్రశ్నించారు. సిబ్బంది గట్టిగా ప్రశ్నిస్తూ నినాదాలు చేయడంతో వారు అక్కడి నుంచి బయటకు వెళ్లి, మళ్లీ కాసేపటికి లోపలకు వెళ్లారు. తమ విచారణకు సహకరించాలంటూ రిక్వెస్ట్ లెటర్ రాసి ఇచ్చారు. రిపోర్టర్లు వాడిన సిస్టమ్స్‌ను పరిశీలించి వారికి సంబంధించిన డ్రైవ్‌లను చూశారు. ఐదుగంటల పాటు తనిఖీల తర్వాత సీసీఎస్ పోలీసులు ఎన్టీవీ కార్యాలయం నుంచి ఒక సీపీయూ తీసుకెళ్లారు.
పోలీసుల దాష్టీకం: దేవి, యాంకర్
పోలీసులు చాలా దాష్టీకానికి పాల్పడుతున్నారని, తనను రోడ్లపై పరుగెత్తించడం చాలా అన్యాయమని ఎన్టీవీ యాంకర్ దేవి అన్నారు. బుధవారం ఆమె ఒక సెల్ఫీవీడియో మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో తనను సిట్ పోలీసులు మంగళవారం సాయంత్రం మూడుగంటల పాటు విచారించారని, తిరిగి రాత్రి తనకు కాల్ చేసి ఉదయం విచారణకు రావాలని చెప్పినట్టు వెల్లడించారు. తన ఆఫీస్‌కు వచ్చి, సీసీఎస్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. ప్రతి ప్రశ్నా తనను వేధించేలా ఉన్నా.. తాను స్పష్టంగా సమాధానం చెప్పానని వివరించారు. తాను వృత్తిధర్మంలో భాగంగా కేవలం వార్త చదివానని, అయినప్పటికీ స్టూడియోలో అడుగుపెట్టినప్పటి నుంచి వార్త చదివేవరకు జరిగిన పిన్ టూ పిన్ చెప్పానని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయినా మళ్లీ విచారణకు రమ్మని రాత్రి కాల్ చేశారని, తాను విచారణకు సహకరించినా తన ఇంటికి పోలీసులను పంపించడం, తన భర్తతో మాట్లాడించడం ఇది కరెక్టేనా? అని ప్రశ్నించారు.
మెడపై చేతులేసి.. గొంతునొక్కుతూ..!
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీస్తున్నది. అర్ధరాత్రి అరెస్టులపై ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, జర్నలిస్టు సంఘాలు మండిపడుతుండగా మరోవైపు అరెస్టయిన వారిపట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందంటూ జర్నలిస్టులు ఆగ్రహిస్తున్నారు. బుధవారం సీసీఎస్‌లో విచారణ అనంతరం జర్నలిస్ట్ సుధీర్‌ను వైద్యపరీక్షల కోసం కింగ్‌కోఠి దవాఖానకు తరలించారు. పరీక్షల అనంతరం ఆయనను బయటకు తీసుకువస్తుండగా మీడియా అతనిని ఏం జరిగిందంటూ ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్తుండగా పోలీసులు ఆయన మెడపై చేతులేసి తీసుకెళ్లడం విమర్శలకు దారితీస్తున్నది. సంబంధం లేకున్నా తనపై కేసులు పెట్టారంటూ సుధీర్ చెప్తున్న సమయంలో పోలీసులు ఆయన మెడపై చేయివేసి గొంతు నొక్కుతూ తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు.
సీసీఎస్‌కు సజ్జనార్!
అరస్టైన ఎన్టీవీలో జర్నలిస్టులు దొంతు రమేశ్, సుధీర్లను విచారించేందుకు బుధవారం రాత్రి సీపీ సజ్జనార్ సీసీఎస్ కార్యాలయానికి వెళ్లారు. ఎన్టీవీలో ప్రసారమైన కథనం ఎలా చేశారు? ఆధారాలేంటి? అని ప్రశ్నించిన సజ్జనార్.. చానల్ యాజమాన్యం పాత్రపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కేసు విచారణకు డీజీపీ నియమించిన ప్రత్యేక సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సజ్జనార్.. కేసులో పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు కేసులో పెట్టిన సెక్షన్లపై సమీక్షించినట్టు తెలిసింది. ఎన్టీవీతోపాటు ఈ కేసులో పేర్కొన్న మిగతా చానల్స్‌కు సంబంధించిన 32 మందిని అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్దం చేసినట్టు ఓ పోలీస్ అధికారి చెప్పారు. అసలు వార్త ప్రసారానికి ఆధారాలేంటనే దిశగా విచారణ జరుగుతుండగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, సుధీర్ల పాత్ర, వారు ఏమీ ఇన్పుట్స్ ఇచ్చారని అడిగినట్టు తెలిసింది. వార్త ప్రసారానికి ప్రోత్సహించిందెవరనే కోణంలో కూడా ఈ విచారణ జరుగుతున్నట్టు ఆ అధికారి విశ్వసనీయంగా చెప్పారు.