నెట్వర్క్ నమస్తేతెలంగాణ, డిసెంబర్ 6 : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై సర్కారు అప్రజాస్వామిక వైఖరి అవలంబిస్తున్నదని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. చలో ట్యాంక్‌బండ్‌కు బీఆర్ఎస్ ఇచ్చి న పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ దండు కదిలింది. హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. అరెస్టులు, హౌజ్ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలో నిరసన తెలిపే హక్కు లేదా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టులకు నిరసనగా చలో ట్యాంక్‌బండ్‌కు బయల్దేరిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావును ఇంట్లో నిర్బంధించారు. ఆర్మూర్, బాల్కొండలోనూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నదని, రాక్షస పాలన అంతం ఎంతో దూరంలో లేదని రాజేశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. రాష్ట్రంలో పోలీసులు హద్దులు దాటుతున్నారని మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించే నేతలను అర్ధరాత్రి జైలుకు పంపడమేంటని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ కుట్రలను కోర్టుల వేదికగా ఎదురొంటామని మాజీఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టంచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగాయి.
బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను పోలీసులు హౌజ్అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు గులాబీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కాంగ్రెస్ సర్కారు హరీశ్‌రావును అరెస్టు చేసిందంటే రేవంత్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డట్టే అని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.