హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కల్తీ విత్తన ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీస్, వ్యవసాయ అధికారుల బృందాలు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి శుక్రవారం వరకు మొత్తం 84 కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల్లో 276 మందిని అరెస్టు చేసినట్టు అడిషనల్ డీజీ నాగిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు 702.33 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకొన్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో అత్యధికంగా నార్త్‌జోన్ పరిధిలోని రామగుండంలో 12 కేసుల్లో 22 మందిని, వెస్ట్‌జోన్ పరిధిలోని నల్లగొండ జిల్లాలో 28 కేసుల్లో 165 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, 2014 నుంచి ఈ నెల 8 (శుక్రవారం) వరకు రాష్ట్రంలో మొత్తం 1,067 కేసులు నమోదు చేశారు. 2,354 మందిని అరెస్టు చేశారు. తరచూ ఈ నేరానికి పాల్పడుతున్న 67 మందిపై పీడీయాక్ట్‌లు నమోదు చేశారు. మొత్తం 12,490 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు.