జయశంకర్ భూపాలపల్లి. మే 8(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా పోలీసులు మహిళలపై జులుం ప్రదర్శించారు. ఆలయంలో ఉన్న జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితోపాటు మరి కొందరు మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో భూపాలపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి ట్రస్టు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ముహూర్తం నిర్ణయించడం వివాదానికి దారి తీసింది.
బీఆర్ఎస్ శ్రేణులు, ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయం కేసు కోర్టులో స్టే ఉండగా ట్రస్టు ఎలా ఏర్పాటు చేస్తారని, అధికార పార్టీ నేతల తీరుపై మండిపడిన గండ్ర వెంకటరమణారెడ్డి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోగా గండ్ర జ్యోతి మహిళా కార్యకర్తలతో అక్కడే ఉన్నారు. ఎవరూ లేని సమయం చూసిన పోలీసులు గండ్ర జ్యోతితో పాటు మహిళా కార్యకర్తలను బలవంతంగా స్టేషన్కు ఈడ్చుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో గండ్ర జ్యోతి స్పృహ తప్పి పడిపోగా జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ భూపాలపల్లిలోని ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు.