అన్నదాతపై పోలీసుల దౌర్జన్యం
రిజర్వాయర్‌లో కోల్పోయిన భూమికి పూర్తిస్థాయిలో పరిహారం రాలేదని పొలంలోకి వెళ్లి నిలదీసిన రైతుపై పోలీసులు చేయిచేసుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
- భూమి పరిహారం అడిగినందుకు రైతు నర్సింహులుపై దాడి
- చేయిచేసుకుని, గల్లా పట్టి ఈడ్చుకెళ్లే యత్నం
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
- మహబూబ్‌నగర్ జిల్లా ఉద్ధండాపూర్‌లో ఘటన
జడ్చర్ల టౌన్, అక్టోబర్ 24 : రిజర్వాయర్‌లో కోల్పోయిన భూమికి పూర్తిస్థాయిలో పరిహారం రాలేదని పొలంలోకి వెళ్లి నిలదీసిన రైతుపై పోలీసులు చేయిచేసుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధిత రైతు నర్సింహులు కథనం ప్రకారం… జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్కు చెందిన రైతు నర్సింహులుకు 1.20 ఎకరాల పొలం ఉన్నది. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణలో మొత్తం భూమిని కోల్పోయాడు. ఇందుకు అధికారు లు కేవలం ఎకరానికి రూ.6.50 లక్షల పరిహా రం మాత్రమే ఇచ్చారు. మిగతా 20 గుంటల పరిహారం అందకపోవడంతో రైతు కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
రిజర్వాయర్ బండ్ పనులు చేపట్టేందుకు సంబంధిత కంపెనీ జేసీబీలు, హిటాచీ లు శుక్రవారం నర్సింహులుకు చెందిన పొలం వద్దకు చేరాయి. రైతు తన భూమికి సంబంధించిన పూర్తిస్థాయిలో పరిహారం రాలేదని, మిగతా 20 గుంటల భూమికి పరిహారం అందించాకే తన పొలంలో పనులు చేపట్టాలని కోరాడు. రిజర్వాయర్ పనులకు అడ్డుపడుతున్నాడంటూ గుత్తేదారు, ఇరిగేషన్ అధికారులు, జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై మల్లేశ్, నర్సింహులును అక్కడి నుంచి పంపించేందుకు యత్నించే క్రమంలో రైతుపై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కాళ్లు మొక్కుతామన్నా బెదిరించారు : రైతు
తనకు ఇంకా 20 గుంటలకు సంబంధించి పరిహారం ఇవ్వాల్సి ఉన్నదని చెబుతుండగానే ఎస్సై వచ్చి తనపై చేయిచేసుకుని గల్లా పట్టి ఈడ్చుకెళ్లేందుకు యత్నించాడని రైతు నర్సింహులు ఆరోపించాడు. పొలంలో సాగుచేసిన మక్కజొన్న పంట సొప్పను గొర్రెలు మేస్తాయని రెండు, మూడు రోజులు ఆగాలని వేడుకున్నా ఎస్సై తనపై దురుసుగా ప్రవర్తించారని వాపోయాడు. తన మాటలను ఏ మాత్రం వినకుండానే చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశాడని ఆవేదన చెందాడు. కాళ్లు మొక్కుతాం.. తన భర్తను వదలిపెట్టండని బతిమాలినా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరించారని నర్సింహులు భార్య మౌనిక ఆరోపించింది. తన భర్తపై జరిగిన దాడిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడ్తానని తాను చెప్పిన తర్వాత వదిలిపెట్టారని ఆమె తెలిపింది. ‘ప్రాజెక్టులో కోల్పోయిన భూమికి సంబంధించిన పరిహారం ఇవ్వలేదు. పొలంలోకి రానివ్వట్లేదు. మాకు అధికారులే న్యాయం చేయాలి’ అని రైతు నర్సింహులు వేడుకుంటున్నాడు.
రికార్డులను పరిశీలిస్తున్నాం: తహసీల్దార్
రైతు నర్సింహులుకు మొత్తం పరిహారం ఇచ్చినట్టు రికార్డు ఉన్నదని, మిగతా 20 గుంటల పరిహారం సంబంధించిన రికార్డును పరిశీలిస్తున్నామని తహసీల్దార్ నర్సింగ్‌రావు తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల వద్దనున్న పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించాక నర్సింహులు 20 గుంటల భూమి పరిహారం ఏ ఖాతాలో పడ్డాయో తెలుస్తదని చెప్పారు.
రైతుపై ఎస్సై చేయిచేసుకోలేదు
రిజర్వాయర్ పనులను అడ్డుకుంటున్నాడని రైతు నర్సింహులుపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారని సీఐ కమలాకర్ తెలిపారు. పరిహారం డబ్బుల కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని.. పనులను అడ్డుకోవద్దని చెప్పి రైతును అక్కడి నుంచి పంపించేందుకు ఎస్సై మల్లేశ్ ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు. అతనిపై ఎస్సై చేయిచేసుకోలేదని, అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

