TGPA | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు అకాడమీకి ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్వో సర్టిఫికెట్ వచ్చింది. దేశంలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ అందుకున్న మొదటి పోలీసు అకాడమీగా.. టీజీపీఏ నిలిచింది. ఈ మేరకు ఐఎస్వో ప్రతినిధులు గురువారం డీజీపీ జితేందర్, పోలీసు అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష బిస్త్‌కు ఐఎస్వో సర్టిఫికెట్ ప్రదానం చేశారు. నాణ్యమైన ఆహార ప్రమాణాలు, క్యాంటీన్ శుభ్రత వంటి అంశాలతోపాటు నాణ్యమైన శిక్షణ, పర్యావరణ వసతులు వంటి పలు అంశాల్లో జాతీయస్థాయిలో 5 స్టార్ రేటింగ్ సాధించడంతో ఐఎస్వో సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. అవార్డు రావడంపై డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తంచేస్తూ అధికారులను అభినందించారు.
కేసీఆర్ హయాంలోనే వసతులు..
రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీ 150కి పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఇక్కడ కానిస్టేబుల్ నుంచి ఎస్సై ఆపై స్థాయి, గ్రూప్ -1ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఇచ్చే వెపన్ డ్రిల్ పోలీస్ శిక్షణలో ప్రధానమైనది. 9ఎంఎం పిస్టల్, 9ఎంఎం కార్బన్, ఏకే 47 లాంటి 11 రకాల వెపన్స్ వినియోగంపై శిక్షణ ఇస్తారు. అత్యంత కీలకమైన అవుట్ డోర్ శిక్షణలో వ్యాయామం, జంగిల్ క్రాసింగ్, రోప్ ైక్లెంబింగ్, ఫైర్ మెన్ లిఫ్టింగ్, డిస్, క్యాట్ వాక్ తదితర వాటిపై తర్ఫీదునిస్తారు. సైబర్ ల్యాబ్‌లు, విశాలమైన క్యాంటీన్లు, ఆధునిక భవనాలు, క్రీడా మైదానాలు వంటి వాటి కల్పనకు నాటి సీఎం కేసీఆర్ విశేష కృషిచేశారు. స్వరాష్ట్రంలో మరిన్ని నిధులు కేటాయించి.. దేశంలోనే అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్‌గా తీర్చిదిద్దారు. నాడు కేసీఆర్ కల్పించిన మౌలిక వసతుల ఫలితంగా నేడు ప్రతిష్ఠాత్మక ఐఎస్వో సర్టిఫికెట్‌ను పోలీసు అకాడమీ సొంతం చేసుకున్నది.