ఖమ్మం రూరల్, ఏప్రిల్ 10 : 50 ఏండ్లకు పైబడి సాగు చేసుకుంటున్న తమ పంట భూములను లాక్కోవద్దని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అధికారులు పోలీసుల సహకారంతో జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకోగా రైతులు అడ్డుకొని ధర్నాకు దిగిన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలం పోలెపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలెపల్లి సమీపంలోని మున్నేరు వాగు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టిన భూముల్లో ఉదయం 10 గంటల నుంచి టెంట్లు వేసుకుని వందమంది రైతులు నిరసన చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవద్దని అధికారులను కోరారు. ఈ క్రమంలో అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో అక్కడికి చేరుకోవడంతో రైతులు జేసీబీలు, బుల్డోజర్లను అడ్డుకున్నారు. రూరల్ ఎస్సై అనిల్, పోలీస్ సిబ్బందికి రెండుచేతులు జోడించి దండంపెడుతూ తమ భూముల జోలికి రావొద్దని, ఆడపిల్లల పెళ్లిళ్లకు పసుపు, కుంకుమ కింద భూములను ఇప్పటికే రాసిచ్చామని ప్రాధేయపడ్డారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. చివరికి రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని రైతులకు పోలీసులు, అధికారులు సూచించారు. తర్వాత అక్కడి నుంచి బుల్డోజర్లు, జేసీబీలు వెళ్లిపోవడంతో రైతులు శాంతించారు. రైతులకు సీపీఎం మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి మద్దతు తెలిపారు.