హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : పీఎన్(పోలవరం-నల్లమల) లింక్ ప్రాజెక్టు లక్ష్యం గోదావరి జలాలనే కాదు కృష్ణా జలాలను సైతం కొల్లగొట్టడమే. ఆ దిశగానే ఏపీ సర్కారు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టులో చేసిన ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులతో యథాతథంగా కొనసాగించడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. జీబీ లింక్, పీఎన్ లింక్ ప్రాజెక్టుల్లో పెద్దగా మార్పులేమీ లేవు. మూడో దశలో బనకచర్లను తప్పించి.. నల్లమలసాగర్‌కు నీటిని తరలించడం ఒక్కటి తప్ప అనేది తెలిసిన విషయమే.
ఇప్పుడు ఎలాగూ శ్రీశైలం నుంచి బనకచర్లకు దొడ్డిదారిలో నీటిని తరలించుకుపోతున్న ఏపీ.. అదే శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నిర్మించిన వెలిగొండ ప్రాజెక్ట్‌లోని ఓ భాగమైన నల్లమల సాగర్‌కు పోలవరం నుంచి నీటిని తరలించాలని ప్లాన్చేసింది. అంతేకాదు భవిష్యత్తులో బనకచర్ల లింక్‌ను కూడా పూర్తి చేస్తామని చెప్పకనే చెబుతున్నది. జీబీ లింక్‌లో భాగంగా 200 టీఎంసీలు తరలించాలనుకున్న ఏపీ.. ఇప్పుడు పీఎన్ లింక్‌లోనూ అంతే మొత్తంలో నీటిని తరలించుకుపోనున్నది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఇప్పటికే టెండర్లను పిలిచింది.
పీఎన్ లింక్‌లో భాగంగా పోలవరం కుడికాలువ నుంచి మొదటిదశలో ప్రకాశం బరాజ్‌కు, రెండో దశలో ప్రకాశం బరాజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు జలాలను తరలించాల్సి ఉంటుంది. ప్రకాశం బరాజ్ నుంచి జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలించే కాలువ నాగార్జునసాగర్ కుడికాలువను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్ కుడికాలువ దాదాపు 202 కి.మీ పైగా ఉంటుంది. అందులో 80 కి.మీ పాయింట్ వద్ద పీఎన్ లింక్ కెనాల్, సాగర్ కుడికాలువలు కలుస్తాయి. ఏపీ సర్కారు గతంలోనే కుడికాలువను ఆ పాయింట్ నుంచి మరింత విస్తరించి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అనుసంధానిస్తామని వెల్లడించింది. పూర్వ జీబీ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనల్లో పొందుపరిచింది కూడా. ప్రస్తుతం మాత్రం పీఎన్ లింక్ కెనాల్‌ను సాగర్ కుడికాలువతో కలుపబోమని, అక్విడెక్ట్ ద్వారా జలాలను తరలిస్తామని నమ్మబలుకుతున్నది. కానీ ఆచరణలో ఏపీ చెప్పేందంతా ఉట్టిదేనని తెలిసిపోతుంది. గత అనుభవాలు కూడా అందుకు నిదర్శనం.
పరిమితులకు మించి పోలవరం కుడి కాలువ, పోతిరెడ్డిపాడు కాలువల తదితర నిర్మాణాలు, వివిధ ప్రాజెక్టులతో చేసిన అనుసంధానాలే అందుకు సజీవ సాక్ష్యం. ప్రస్తుతం కూడా సాగర్ కుడికాలువను పీఎన్ లింక్‌లో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అనుసంధించేందుకు లోపాయికారిగానే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. తద్వారా భవిష్యత్‌లో గోదావరి జలాలనే కాదు సాగర్ నుంచి కృష్ణా జలాలను కూడా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించే అవకాశమున్నది. ప్రస్తుతం బొల్లాపల్లి రిజర్వాయర్‌ను 173 టీఎంసీలతో చేపడుతున్నా, భవిష్యత్‌లో 400 టీఎంసీలకు పెంచుకునే వెసులుబాటు ఉందని కూడా ఏపీనే జీబీ లింక్ పీఎఫ్ఆర్(ప్రీ ఫిజుబులిటీ రిపోర్ట్)లో స్పష్టంగా తెలియజేసింది. అదీగాక సాగర్ కుడికాలువకు సంబంధించి ఏపీకి ఎక్కడా పెద్ద రిజర్వాయర్లు అందుబాటులో లేవు. ఉన్నవన్నీ అర టీఎంసీ, పావు టీఎంసీ సామర్థ్యమున్నవే. ఈ నేపథ్యంలో బొల్లాపల్లితో అనుసంధానిస్తే కృష్ణాకు సంబంధించి అతిపెద్ద రిజర్వాయర్ అందుకు ఏపీకి అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పీఎన్ లింకుతో అనుసంధానించేందుకు ఏపీ లోపాయికారీగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. సూటిగా చెప్పాలంటే కృష్ణా జలాలకు సాగర్ నుంచి కూడా గండికొట్టే అవకాశం ఏపీకి దక్కుతుంది.
ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా ఏపీ ఏటా కేటాయింపులకు మించి కృష్ణా జలాల దోపిడీకి పాల్పడుతున్నది. చెన్నైవాసుల దాహం తీర్చేందుకు మానవతా దృక్పథంతో కృష్ణా బేసిన్‌లోని నాటి కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ రాష్ట్రం 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీల నీటిని అందివ్వాలని ఒప్పందం కుదిరింది. ఆ నీటి సరఫరా బాధ్యతను కృష్ణా బేసిన్లో దిగువన ఉన్న ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి కట్టబెట్టాయి. మిగుల జలాల నుంచి ఏటా ఒప్పందం మేరకు నీటిని చెన్నైకి ఇవ్వాల్సి ఉంది. అంతవరకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం పెద్దన్నపాత్ర ముసుగులో చెన్నైకి తీరని ద్రోహాన్ని తలపెట్టడం మొదలుపెట్టింది. ఉమ్మడి పాలకులు కృష్ణా జలాలను జలదోపిడీకి తెరలేపారు. తొలుత ఎస్ఆర్బీసీ(శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్)ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చారు.
ఆ తర్వాత మొత్తంగా 34 టీఎంసీలను అది కూడా 880 అడుగులు ఉన్నప్పుడు వరద జలాలను తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడితో ఊరుకున్నారా అంటే అదీలేదు. ఆ మాటున అంతకు నాలుగింతల జలాలను ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్కేప్ చానల్ ద్వారా అక్రమంగా పెన్నాబేసిన్‌కు ఏపీ తరలించుకుపోతున్నది. 880అడుగుల నుంచి ఏకంగా 800 అడుగుల నీళ్లను తీసుకుపోయేలా ప్రాజెక్టులను చేపట్టారు. వాస్తవంగా 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాల్సిన కాలువను తొలుత 11వేల క్యూసెక్కులకు, ఆ తర్వాత 44వేల క్యూసెక్కులకు, ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దానిని సామర్థ్యాన్ని ఏకంగా 88వేల క్యూసెక్కులకు విస్తరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడు, దాని అనుబంధ అవుట్లెట్ల ద్వారా తరలించే జలాల నిల్వ కోసం ఏకంగా 350టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించింది అంటే జలదోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా కృష్ణా నదినే చెరబడుతున్నది. వచ్చిన జలాలను వచ్చినట్టు పెన్నా బేసిన్‌కు మళ్లిస్తున్నది.
అదీగాక ఇప్పటివరకు శ్రీశైలం నుంచే కృష్ణాజలాలను కొల్లగొడుతున్న ఏపీ, ప్రస్తుతం సాగర్ నుంచి కూడా కృష్ణా జలాలను మళ్లించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా సాగర్ కుడికాలువను సైతం విస్తరించేందుకు పూనుకున్నది. కృష్ణా వరద జలాలను కుడికాలువ ద్వారా బొల్లాపల్లికి తరలించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.