యాచారం, ఆగస్టు1: ఫార్మా బాధిత రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి అన్నారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను ఫార్మా బాధిత రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవుల సరస్వతి మాట్లాడుతూ.. ఫార్మాసిటీని రద్దు చేస్తామని, ఫార్మా భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఫార్మాసిటీకి ఇవ్వని 2500 ఎకరాల భూములకు సంబంధించి కోర్టులో స్టే ఉండగానే ప్రభుత్వం పోలీసుల పహరా నడుమ సర్వే చేస్తూ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నదని తెలిపారు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఫార్మాసిటీకి భూములిచ్చేదిలేదని స్పష్టంచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీ జీవోను పూర్తిగా రద్దుచేసి, రైతుల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫార్మా బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మీనాక్షి నటరాజన్‌ను కోరారు.
అది జనరహిత యాత్ర బీఆర్ఎస్ నేతల అరెస్టు అన్యాయం ; అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అందోల్, ఆగస్టు 1 : అందోల్-జోగిపేటలో శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించింది జనహిత యాత్ర కాదని జనరహిత యా త్ర అని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎద్దేవాచేశారు. యాత్ర కోసం వారం నుంచి కాంగ్రెస్ నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేసినా 300 మంది కూడా రాలేదని దెప్పిపొడిచారు. వచ్చిన కార్యకర్తలను మీనాక్షి వద్దకు వెళ్లకుండా పోలీసు వలయం ఏర్పాటు చేశారని, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారని, ప్రజాపాలనలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉండీ యాత్రలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు, అభివృద్ధి పనులను పరిశీలిస్తూనే యాత్ర సాగిందని దుయ్యబట్టారు.