ఖైరతాబాద్, ఆగస్టు 6: బీసీలంతా ఒక్కటై పోరాడితనే తమ హక్కులు సాధించుకోగలరని, బీసీల్లో చైతన్యం తెచ్చి పాలకుల కండ్లు తెరిపించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకాన్ని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీ భావజాల వ్యాప్తికి ‘మా వాటా మాకే’ పుస్తకం స్ఫూర్తిని కలిగిస్తుందని కొనియాడారు. ఈ పుస్తకాన్ని వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బీసీల ఆత్మను ఆవిష్కరించే పుస్తకాన్ని గౌరీశంకర్ రాశారని ప్రశంసించారు.
బీసీ కులగణనకు ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ తమకు హామీ ఇచ్చారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుందని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. నిజానికి నెల రోజుల్లోనే కులగణన చేయించవచ్చని అభిప్రాయపడ్డారు. బీసీలంతా ఐక్యంగా పోరాడితనే హక్కులు సాధించుకోగలరని పిలుపునిచ్చారు. ముందు వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నేతలంతా ఐక్యం కావాలని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు.
దేశంలో కులగణన జరిగితే సమాజం చీలిపోతుందంటున్న వారు.. వర్ణ వ్యవవ్థతో ఎప్పుడో సమాజాన్ని చీల్చేశారని విమర్శించారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై వర్తింపజేయలేదని, బీసీల పరిమితి గురించి మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.
జూలూరు రచన బీసీ ఉద్యమానికి దోహదపడుతుందని, ఇది కేవలం ఆలోచనాత్మకమే కాదని, రచయితలోని తపనకు, ఆత్మఘోషకు కూడా అద్దం పడుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు పేర్కొన్నారు. త్వరలోనే బీసీల మహా ఉద్యమాన్ని రుచిచూపిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్, రైతుల ఉద్యమాల స్ఫూర్తిగా సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని వెల్లడించారు. కులగణన చేయిస్తారా? లేక కుర్చీలు వదులుకుంటారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. టీయూడబ్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీసాగర్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రొఫెసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల ఐక్యత, రిజర్వేషన్లపై పల్లె నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా గురించి ‘మావాటా మాకే’లో రాశానని పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ తెలిపారు. రాష్ట్రంలోని 400కు పైగా కేంద్రాల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం అరుదైన ఘటనగా అభివర్ణించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బీసీ కవులు, రచయతలు, కుల సంఘాల నేతలు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించుకోడం బీసీ చైతన్యానికి నిదర్శనమని చెప్పారు. బీసీల చైతన్యానికి, ఐక్యతకు, స్థానిక సంస్థల్లో సమ వాటా అన్న డిమాండ్‌కు ఇది బలాన్ని చేకూరుస్తుందని జూలూరు ఆశాభావం వ్యక్తం చేశారు.