హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వివాదం ప్రధాని మోదీకి సంకటంగా మారిందనే చర్చ జరుగుతున్నది. శనివారమే బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం, మరుసటి రోజే మోదీ రాష్ర్టానికి వస్తున్నారు. ఈ వివాదంపై ప్రధాని ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది. తన క్యాబినెట్ సహచర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడం ఒక విధంగా మోదీకి సైతం ఇబ్బందికర అంశమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సభలో అయినా, పార్టీ నేతల సమావేశంలోనైనా మోదీ కచ్చితంగా ఈ అంశంపై స్పం దించాలని అంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తనపై అఘాయిత్యం చేశారంటూ నిర్మల్‌కు చెందిన మైనర్ బాలిక అతనిపై పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు అంత సులువుగా కేసు నమోదు చేయలేదని తెలిసింది. విసిగి వేసారిన అనంతరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ సభ వద్ద తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలు స్పష్టంచేయడంతో పోలీసులు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
కేంద్ర మంత్రి బండి కుమారుడిపై నమోదైన పోక్సో కేసు అంశంపై ప్రధాని మోదీ స్పం దించాలంటూ అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం ప్రాధా న్యం సంతరించుకోవడంతో ప్రధాని కచ్చితంగా సమాధానం చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ ఈ అంశంపై ప్రధాని మౌనందాలిస్తే ఆయన సమర్థించారని భావించాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు, బీజేపీ నేతలు సైతం చెప్తుండటం గమనార్హం. తన సహచర మంత్రి కొడుకుపై దారుణమైన ఆరోపణలతో కేసు నమోదు కావడంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రధాని నైతికతతో సంజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.