హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు అంశం మరో మలుపు తిరిగింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నన వేళ బాధితురాలి తల్లి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు ప్రచారం అవసరం లేదని, తమ బిడ్డకు న్యాయం దక్కితే చాలని తెలిపారు. తన బిడ్డకు జరిగిన అన్యా యం, తాము ఎదుర్కొన్న భయం, ఒత్తిళ్లు, అవమానాలు దేశమంతా తెలుసుకోవాలని కోరుకున్నారు. ‘ఈ ప్రకటన పగతో గానీ, ప్రచారం కోసమో గానీ కాదు. మౌనం కన్నా మాట్లాడితే బాధ తగ్గుతుందనే భావనతోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబమని, అందరి మాదిరిగానే తమ కుమార్తెను విలువలు, చదువు, ఆశయాలతో పెంచామని చెప్పారు. కానీ ‘మా బిడ్డను కాపాడండి.. మా బాధ ను వినండి.. అని సమాజాన్ని, వ్యవస్థలను వేడుకోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పేర్కొన్నారు. గతేడాది భగీరథ్ తన కూతురుకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ఆమె వివరించారు.
తమ కుమార్తెకు 2025లో బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. ‘తరచూ మాట్లాడటం, మాయమాటలతో ఆకర్షించడం, హామీలు ఇవ్వడం, వ్యక్తిగతంగా దగ్గరవడం ద్వారా మానసికంగా అతడిపై ఆధారపడే స్థితికి వెళ్లినట్టు మా కుమార్తె చెప్పింది. ఆమెను మానసికంగా ప్రభావితం చేసి, చదువు, భవిష్యత్తుపై దృష్టి కోల్పోయేలా చేశాడని, ఆమె ఇష్టం లేదని చెప్తున్నా పదేపదే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తీసుకొచ్చాడు’ అని పోక్సో బాధితురాలి తల్లి ఆ లేఖలో పేర్కొన్నారు. వివిధ ప్రదేశాల్లో, అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ప్రాంగణాలు, ముఖ్యంగా 2025 డిసెంబర్ 31న రాత్రి, 2026 జనవరి 1న తెల్లవారుజామున మొయినాబాద్‌లో తన కూతురుపై జరిగినట్టు చెప్పిన ఘటనలను విన్నప్పుడు కలిగిన బాధను మాటల్లో చెప్పలేనన్నారు. తనకు ఇష్టం లేకపోయినా మద్యం సేవించాలని ఒత్తిడి తెచ్చారని, తర్వాత తాను బలహీన స్థితిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురిచేశాడని తన కుమార్తె చెప్పిందని తెలిపారు. 2026 జనవరి తర్వాత తమ కుమార్తె మానసిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని, ఒంటరిగా ఉండటం, మానసికంగా కుంగిపోవడం, అలసట, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటివి గమనించామని, రోజూ మౌనంగా ఏడవడం కనిపించిందని తెలిపారు. ఆమె పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తూ భగీరథ్ నుంచి మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించి తమ వద్ద చాటింగ్‌లు, మెసేజ్‌లు, ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను బాధ పెట్టానని భగీరథ్ ఒప్పుకోవడం, పదేపదే క్షమాపణలు చెప్పడం, శారీరకంగా కలువాలని ఒత్తిడి తేవడం వంటివి ఇందులో ఉన్నాయని తెలిపారు.
2026 మే 8న తాము ధైర్యం చేసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించామని, పోక్సో చట్టం కింద ఫిర్యాదు నమోదు చేయాలని కోరామని పోక్సో బాధితురాలి తల్లి పేర్కొన్నారు. అయినా తమను ఐదు గంటలకుపైగా వేచి ఉండేలా చేశారని ఆరోపించారు. ఆ సమయంలో తమ కుమార్తె మానసికంగా పూర్తిగా కుంగిపోయి అకడే కూర్చున్నదని తెలిపారు. పరిధి(జూరిస్డిక్షన్) సమస్యలు, కేసు బదిలీ వంటి విషయాలు చెప్తూ ఆలస్యం చేశారని పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ గురించి పట్టుబట్టగా చివరికి ఫిర్యాదు తీసుకొని రసీదు ఇచ్చారని తెలిపారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు తమ కూతురు తీవ్రమైన ఆరోపణలు చేసినా, పోలీసులు తేలికపాటి, బెయిల్‌కు అనుకూలమైన సెక్షన్లనే చేర్చారని తెలిసిందని పేర్కొన్నారు. ప్రజా ఆందోళన, సోషల్ మీడియాలో విమర్శలు, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు తర్వాతే నాన్-బెయిలబుల్ సెక్షన్లను చేర్చారని, ఈ మార్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. ఇదే సమయంలో కరీంనగర్ 2టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తమ కుటుంబంపై బ్లాక్మెయిల్, దోపిడీ ఆరోపణలతో కేసు నమోదైందని తెలిసిందని, 2026 ఏప్రిల్ 21న తమ కుటుంబంపై ఫిర్యాదు వచ్చినట్టు అధికారులు చెప్పారని తెలిపారు. ఈ పరిణామాలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం కింద రక్షణ పొందాల్సిన తాము.. ఎదురు కేసులు, సామాజిక అవమానాల మధ్య చికుకున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. తమ కుమార్తెకు మానసికంగా తోడుగా నిలువాల్సిన సమయంలో తమ కుటుంబమే నిందితులుగా మారిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫొటోలు, వీడియోల రూపంలో తమ కుమార్తె గుర్తింపు బయటపడటం, ఆమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగడం తమ కుటుంబానికి మరో శరాఘాతంగా మారిందని బాధితురాలి తల్లి తెలిపారు. ఇప్పటికే మానసిక వేదన అనుభవిస్తున్న తమ కుమార్తె మరోసారి సామాజికంగా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని వాపోయారు. బాధితురాలి గుర్తింపును రక్షించడం సమాజం నైతిక బాధ్యత కూడా అని పేర్కొన్నారు. దయచేసి తమ కూతురు గుర్తింపును బయటపెట్టవద్దని మీడియా, సోషల్‌మీడియా, పౌరసమాజంతోపాటు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబం ఇంత భయం, మానసిక వేదన, సామాజిక అవమానాల మధ్య జీవిస్తుంటే, బండి భగీరథ్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడనే వాస్తవం తమను మానసికంగా కుంగదీస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కుమార్తె వయసుపై చర్చ జరుగుతున్నదని, ఆమె మైనర్ అని నిర్ధారించే చట్టబద్ధ పత్రాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. ‘బాధిత బాలిక తల్లిగా నేను చేతులు జోడించి చెప్పేది ఒకటే.. మేము మీడియా సానుభూతి, రాజకీయ పోరాటం, ప్రజా ఆందోళనలు కోరడం లేదు. ఈ దేశంలోని ప్రతి సాధారణ పౌరుడికీ దకాల్సిన న్యాయాన్నే మేము కోరుతున్నాం. నిష్పాక్షిక దర్యాప్తు, ఆధారాల రక్షణ, రాజకీయ లేదా సామాజిక స్థాయితో సంబంధం లేకుండా చట్టం అందరికీ సమానంగా అమలు కావడాన్నే కోరుతున్నాం’ అని స్పష్టంచేశారు. రాజ్యాం గం, న్యాయవ్యవస్థ, చట్టాలపై తమకు నమ్మకం ఉన్నదని, తమ కుమార్తెకు నిజం, న్యాయం, సమానత్వం దకాలని ప్రార్థిస్తున్నామని ఆమె ఆ లేఖ ద్వారా కోరుకున్నారు.
తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా ముందుకే వెళ్లాలని 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్ణయించుకున్నట్టు పోక్సో బాధితురాలి తల్లి తన లేఖలో తెలిపారు. అయితే కేసు పెట్టొద్దని పరోక్షంగా ఒత్తిళ్లు వచ్చాయని, రాజీకి ఒప్పించే ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి, నిందితుడి వైపు వ్యక్తుల తరఫున మాట్లాడుతున్నానని చెప్పి రాజీ ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 23న తాము భగీరథ్ తండ్రిని ఆయన నివాసంలోనే కలిశామని పేర్కొన్నారు. ‘బాధలో ఉన్న మా కుమార్తెకు అక్కడ మానవీయ కోణంలో భరోసా, రక్షణ దొరుకుతాయని ఆశించాం. కానీ అకడి నుంచి భయంతో తిరిగి వచ్చాం’ అని పేర్కొన్నారు. తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేవారికి తీవ్ర పరిణామాలు తప్పవనే తరహా హెచ్చరికలతో తాము మరింత భయపడిపోయామని వివరించారు. అప్పటినుంచి నిరంతరం భయం, మానసిక ఒత్తిడిలో తాము జీవిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ అంశాలపై స్వతంత్ర విచారణ జరుగాలని ఆమె కోరారు.