బాన్సువాడ, జూలై 29: కాంట్రాక్టు బిల్లుల కోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారని, ప్రజల సంక్షేమం కోసం కాదని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఏనుగు క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్టు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. కేవలం కుమారుల కాంట్రాక్ట్ బిల్లుల కోసమే కాంగ్రెస్లో చేరారని ఆరోపించారు. పోచారం పుత్రుడి బిల్లులు రూ.5.35 కోట్లు మంజూరు చేయించుకున్నారని, ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నేతలు చెప్పారు.