కామారెడ్డి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారు టీటీడీలో జరుగుతున్న శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
స్వామి వారి కళ్యాణానికి ముందుగా జరిగిన హోమంలో సతీసమేతంగా పోచారం పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం కుటుంబ సభ్యులు.. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.