హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ బలవన్మరణంపై శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. శంకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ సమ్మె పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తొందరపడవద్దని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని సూచించారు. కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య బాధాకరమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరితోనే కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో బలవన్మరణాల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు.