హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించి, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో కుట్రలకు పదునుపెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సరారు రాక ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో సుమారు 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగుచేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సరారు రాగానే ఈ ఏడాది సాగు విస్తీర్ణం 73 వేల ఎకరాలకు పడిపోయిందని, అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం.. ఆకలితో అల్లాడే దుస్థితికి వచ్చిందని దుయ్యబట్టారు.
జనగామ, మే 21 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. కాళేశ్వరం కమిషన్ నోటీసుల పేరిట కేసీఆర్‌ను ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నదని మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మండిపడ్డారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌ను తకువ చేయాలన్న ప్రయత్నాలు అప్రజాస్వామికమని, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు.