హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి తెలంగాణకు కాలకేయుడిలా మారారని, బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తన కళాక్షేత్రాన్ని తెలంగాణ ద్రోహి రేవంత్ పారంభించినందుకు కాళోజీ ఆత్మ క్షోభించి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాళోజీ ట్రస్టు సభ్యులు వినతిపత్రం ఇద్దామనుకున్నా రేవంత్ సమయం ఇవ్వలేదని, కనీసం కవులు, కళాకారులను సన్మానించలేదని మండిపడ్డారు. ముందుగా కాళోజీకి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డితో కలసి పోచంపల్లి మీడియాతో మాట్లాడారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే కాళోజీ ట్రస్టుకు నాలుగున్నర ఎకరాల భూమి, కళాక్షేత్రం నిర్మాణానికి రూ.35 కోట్లు విడుదల చేశారని చెప్పారు. భవన నిర్మాణం 95 శాతం కేసీఆర్ హయాంలోనే పూర్తయిందని, కేవలం రంగులు వేసి ప్రారంభించానని రేవంత్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి జిల్లా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హోదాలో రేవంత్ కేసీఆర్‌ను పొగడుతూ ఇచ్చిన పేపర్ యాడ్‌ను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. తన అవసరాన్ని బట్టి నేతలను పొగడటం, తిట్టడం రేవంత్‌కు అలవాటే అని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ బూతుల సభ: చల్లా
వరంగల్‌లో జరిగింది ప్రజాపాలన విజయోత్సవ సభ కాదని, సీఎం రేవంత్ బూతుల సభ అని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. హామీలు ఏం నెరవేర్చారని సభ పెట్టారు? అని నిలదీశారు. రుణాలు రావాలంటే సభకు రావాల్సిందేనని ఒత్తిడి చేసి సభకి రప్పించారని మండిపడ్డారు. సచివాలయం గేటు మారుస్తున్నారు.. కొంపదీసి రేవంతే కట్టారని శిలాఫలకం వేస్తారా?అని అనుమానం వ్యక్తంచేశారు. కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.