హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు, వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు 1300 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించారు. పీఎం ఉషా పథకం కింద 16 జిల్లాల్లో 60కి పైగా కాలేజీల అభివృద్ధి కోసం ఈ ప్రతిపాదనలు అందజేశారు. దీనికి ఆదివారం నాటితో గడువు ముగియనున్నది. ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం గతంలో ఉన్న రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్షా అభియాన్ (పీఎం-ఉషా)గా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మార్చింది. డిసెంబర్ చివరి వారంలో పీఎం ఉషా ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశమై రాష్ర్టాల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నది.
రూసా పథకం కింద రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్రం ఇటీవలే విడుదల చేసింది. ఈ మేరకు రూసా-2లో 35 కోట్ల పెండింగ్ నిధులు విడుదలయ్యాయి. వీటికి గతంలోనే అనుమతి లభించడం, రూసా గడువు పూర్తికావడంతో ఈ నిధులు వస్తాయా లేదోనన్న అనుమానాలను తొలగిస్తూ ఎట్టకేలకు కేంద్రం వాటిని విడుదల చేసింది.