Godavari | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ఎండబెట్టి… గోదావరిని కొల్లగొట్టే కుట్ర మరింత శరవేగంగా అమలవుతున్నది. ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా ఇటు రాయలసీమ… అటు తమిళనాడుకు తన్నుకుపోయే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏకంగా కేంద్రమే రంగంలోకి దిగింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా సాక్షాత్తు ప్రధానమంత్రే ఒక సాగునీటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు పొరుగు రాష్ర్టాల నుంచి ఎదురవుతున్న చిక్కుముళ్లను విప్పేందుకు ఈ నెల 28వ తేదీన పీఎం మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సీఎంలు పాల్గొనున్న సమావేశంలో పోలవరానికి పొరుగు రాష్ర్టాల ద్వారా ఉన్న అడ్డంకులను తొలగించే అంశాలను మాత్రమే ఎజెండాగా చేర్చారు తప్ప ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణాజలాల వాటా, ఇతర సమస్యలను పొందుపర్చలేదు. అదే ఏపీ విభజన ట్టంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. పన్నెండేండ్లపాటు దానిని పట్టించుకోని మోదీ సర్కార్ కనీసం ఈ సమావేశంలో ప్రస్తావించేలా కనిపించడం లేదు. కేవలం పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంతోపాటు దాని కొనసాగింపుగా కావేరి వరకు గోదావరి జలాల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నట్టు అర్థమవుతున్నది.
తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే ఈ ప్రాజెక్టును నిరుడు పార్లమెంటు ఎన్నికలకు ముందే చేపట్టాలనుకున్నా.. బీఆర్ఎస్ గళం విప్పడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరికి గోదావరిజలాల తరలింపును ముందుకు తీసుకుపోవాలనే దూకుడును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనబరుస్తున్నది. వర్షాలు మొదలైన దరిమిలా వచ్చే ఏడాది వరకు మేడిగడ్డ పునరుద్ధరణ అనేది అసాధ్యమైనందున ఈ లోపే గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
దీంతో ఒకవైపు తెలంగాణలో మేడిగడ్డ పునరుద్ధరణ లేకుండా గోదావరిజలాల వినియోగం తగ్గుముఖం పట్టగా… అదే సమయంలో కేంద్రం అనుమతితో దిగువన బనకచర్ల, కావేరి అనుసంధాన ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ వేయాలంటూ చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న దరిమిలా ట్రిబ్యునల్ ముందు కాళేశ్వరం పక్కకుపోయి.. బనకచర్ల, కావేరి అనుసంధాన ప్రాజెక్టులకు అధికారిక కేటాయింపులు జరిగే ప్రమాదం పొంచి ఉన్నదని తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక రాష్ర్టానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడమే ప్రధాన ఎజెండాగా ప్రధాని సమావేశాన్ని నిర్వహించడమంటే దాని వెనుక పెద్ద మతలబే దాగి ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలవరం ప్రాజెక్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఎజెండా అంశాలతో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా సమాచారం అందింది. నాలుగు రాష్ర్టాల సీఎంలు పాల్గొనే ఈ సమావేశంలో మొత్తంగా 5 ఎజెండా అంశాలు చేర్చారు. అందులో 4 కేంద్రప్రభుత్వ పథకాల అమలుపై ఉన్నాయి.
మొదటి ఎజెండా అంశంగా ఏపీలోని పోలవరం సాగునీటి ప్రాజెక్టును ఎంపిక చేయడమంటే ఆ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రధాని ఎంత చొరవ చూపుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ప్రధానిస్థాయిలో కేవలం ఒక్క సాగునీటి ప్రాజెక్టుపై 4 రాష్ర్టాల సీఎంలతో సమీక్ష నిర్వహించడమనేది చరిత్రలో బహుశా ఇదే తొలిసారి అని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం ఈస్థాయిలో దృష్టిపెట్టడమంటే ఆ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి విస్పష్టంగా సాంకేతాలు ఇస్తున్నట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు.
పన్నెండు ఏండ్లలో ప్రధాని మోదీ ఒకే ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని సాగునీటివర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రధాని తరచూ నిర్వహించే ‘ప్రగతి’ సమావేశాల్లో ప్రధానంగా రీజియన్ పరిధిని ప్రామాణికంగా తీసుకుంటారు. అత్యవసర అంశాలు తెరపైకి వచ్చినప్పుడు దానిపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తారు. కానీ ఈ నెల 28న జరగనున్న సమావేశంలో కేవలం ఒక రాష్ర్టానికి చెందిన ఒక ప్రాజెక్టును ఎజెండాగా ఎంచుకోవడం వెనక ఏపీతోపాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బహుళ ప్రయోజనాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ పరిణామం తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే అంశాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంగానీ.. తెలంగాణలోని బీజేపీ ఎంపీలుగానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కసారి పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమమైందంటే.. 365 రోజులపాటు నీటి లభ్యతకు అవకాశం ఉంటుంది. ఈ నిల్వను వనరుగా చూపి అక్కడి నుంచి మరిన్ని ప్రాజెక్టుల ద్వారా గోదావరిజలాల తరలింపు అనేది చేపట్టేందుకు సాంకేతికంగా వీలవుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను చేపట్టేందుకు కేంద్రమే రంగంలోకి దిగింది. ఇప్పటికే చంద్రబాబు బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం పూర్తిచేయడం.. రూ.3వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు రూపంలో జాతీయ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది.
ఈ ప్రాజెక్టులో ఒక్క అడుగు ముందుకుపడిన వెంటనే.. మరో అడుగు వేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఎలాగూ గోదావరి-కృష్ణా-పెన్నా ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నందున, పెన్నా నుంచి కావేరికి గోదావరిజలాల ప్రాజెక్టును తాము చేపడతామంటూ కేంద్రం ప్రకటించే అవకాశముంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పది నెలలకు పైగా సమయం ఉన్నందున ఈలోగా డీపీఆర్.. అనుమతుల ప్రక్రియలన్నీ పూర్తిచేసి శంకుస్థాపన చేసినట్లయితే.. తమిళనాట కావేరికి గోదావరిని తీసుకువస్తున్నామనే ప్రచారాన్ని ఎన్నికల్లో హోరెత్తించేందుకు బీజేపీకి అవకాశం దొరుకుతుంది.
అయితే ఇవన్నీ రాజకీయంగా ఒక ఎత్తయితే.. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరీ అనుసంధాన ప్రాజెక్టులకు కేంద్రమే నిధులు ఇవ్వనున్నందున అవి జాతీయ ప్రాజెక్టులుగా చెలామణిలోకి వస్తాయి. దీంతో గోదావరి ట్రిబ్యునల్ కొత్తగా ఏర్పడితే దానిముందు ‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్టు నీటి కేటాయింపుల్లో మన కాళేశ్వరం కంటే ముందుగానే ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరుగుతుంది. అప్పుడు తెలంగాణ నోట్లో మట్టి పడినట్టేనని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టుపై ప్రధాని సమీక్షించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే అదే చట్టంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు సైతం జాతీయ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన ఉందనే వాస్తవాన్ని మాత్రం 12 ఏండ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విస్మరిస్తూ వస్తున్నది. ఇప్పుడు హడావుడిగా పోలవరంలో 120 టీఎంసీల నీటిని నిల్వ చేసే బృహత్తర బాధ్యతను ఏపీతోపాటు కేంద్రం కూడా తన భుజాన వేసుకున్నదని ఇంజినీరింగ్ వర్గాలు చెప్తున్నాయి.
పోలవరంలో పూర్తిస్థాయి నిల్వ 194 టీఎంసీలు (150 అడుగుల ఎఫ్ఆర్ఎల్) కాగా… కనీస నీటి సేకరణస్థాయి (ఎండీడీఎల్)లో 120 టీఎంసీలు (141.35 అడుగులు) నిల్వ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఎండీడీఎల్ స్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడమే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లక్ష్యంగా తెలుస్తున్నది. దీనికితోడు చంద్రబాబు డెడ్‌స్టోరేజీ (135 అడుగులు-74 టీఎంసీల నిల్వ) నుంచి కూడా నీటిని ఎత్తిపోసుకునేందుకు పోలవరం లిఫ్టులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పోలవరం సత్వరమే పూర్తి చేసి 120 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా ఏపీ ప్రయోజనాలు నెరవేరుతాయి.
ఎగువన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోవడంతో ఏడాదిపాటు ప్రాణహిత నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలు నేరుగా పోలవరానికి చేరుతాయి. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు తెలంగాణ గడ్డపై ప్రాణహితజలాల వినియోగం లేదనే వివరాల్ని నదుల అనుసంధాన ప్రాజెక్టుల డీపీఆర్‌లలో అస్త్రంగా మలచుకునే అవకాశముంటుందని సాగునీటి రంగ నిపుణుడు ఒకరు తెరవెనక కుట్రను విశ్లేషించారు.