Minister KTR | హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పాలన సాగుతుంటే.. బీజేపీ మాత్రం కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం హిందూముస్లింలు అని పంచాయతీలు పెట్టి ఆ మంటలతో చలి కాచుకోవాలనే ప్రయత్నిస్తుందని విమర్శించారు. చాతకాని వాళ్లు మాత్రమే భావోద్వేగాలను రెచ్చగొడుతూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తారని అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్తు మనదేనని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించి సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తే.. ఇది నచ్చని కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి జెండా ఎగురవేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సమాజాన్ని కుల, మత పరంగా చీల్చి ప్రజల మధ్యలో ఉద్రిక్తతలు, వైషమ్యాలు రెచ్చగొట్టి హిందువు, ముస్లిం అని పనికిమాలిన పంచాయతీలు పెట్టి ఆ మంటలతో చలి కాచుకోవాలని దౌర్భాగ్యపు రాజకీయం చేస్తుంది నరేంద్రమోదీ ప్రభుత్వమని విమర్శించారు. సింగరేణికి మోదీయే శత్రువని ఆరోపించారు. సింగరేణిని ముంచే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అని అన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు గత 9 సంవత్సరాలుగా అన్యాయమే చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడి ఏర్పడక ముందే ఏడు మండలాలను గుంజుకుందని, సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తీసుకుందన్నారు. ఫాసిస్టు దోరణిలో, నిరంకుశమైన ధోరణితో ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారని.. అయితే మాటలు తప్ప చేతలు లేవన్నారు. ప్రజలు కూడా మోదీ భ్రమల్లో నుంచి బయటపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కానీ సీఎం కేసీఆర్ చెప్పకుండానే, ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు రైతు బంధు ద్వారా జమ చేశారన్నారు. స్వాంతంత్య్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి స్కీం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ లాంటి నేత దేశంలో మరెవ్వరూ లేరన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగ సమస్య గురించి ఇక్కడ దీక్ష చేస్తాడని, ఆయనకు సిగ్గు శరం, లజ్జ , పౌరుషం, చీము నెత్తురు ఉంటే నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కొత్తవి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఉడగోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రధానిని చేస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తా అని మోదీ చెప్పారని.. కానీ లీటరు ధర ఇప్పుడు వంద దాటేసిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు ధరలు తగ్గిస్తామని చెప్పి రూ.1200 చేర్చారన్నారు. నరేంద్రమోదీకి, ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. రూపాయి విలువ గురించి, అధికారంలో లేనప్పుడు చాలా మాటలు మాట్లాడిన మోదీ ఇప్పుడు వేటికి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడరు కానీ మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తారని మండిపడ్డారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి రజాకార్ అనే సినిమా తీశారని, హిందూముస్లింలు చంపుకునేది చూపెట్టే పాత గాయాలను మళ్లీ రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఇలా ప్రజలను రెచ్చగొడుతుంటారని ఆరోపించారు. చాతకాని వాళ్లు మాత్రమే భావోద్వేగాలను రెచ్చగొడుతూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తారన్నారు. 2022 వరకు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇండ్లు, 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని, ఇంటింటికి నల్లా నీరు ఇస్తామని చెప్పారని, ఇవేవి అమలు చేయరు.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి అడిగితే మాట్లాడలేని దద్దమ్మలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని అన్నారు. దిగజారిపొయిన ప్రధానమంత్రి, ఆయన పార్టీ ఒక వైపు ఉందన్నారు.