హైదరాబాద్/హిమాయత్‌నగర్, జనవరి 24: నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కే ధర్మేంద్ర విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి చాలా ప్రమాదకరమని, దేశాన్ని వందేండ్లు వెనక్కి నెట్టేలా ఉన్నాయని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు వల్ల యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కడం లేదని మండిపడ్డారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పిందని, యువతను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీకాంత్, నేతలు సత్యప్రసాద్, కొండల్, శ్రీనివాసులు, మహేందర్, బాలకృష్ణ పాల్గొన్నారు.