హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి అని ప్రధాని మోదీ కొనియాడారు. బుధవారం ఏపీలోని పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తున్నదని, విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆయన విశిష్ట సేవలు చేశారని తెలిపారు.
అంతకుముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవలకు స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు.