హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆపద వచ్చినా… కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది. అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వచ్చినా ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగానే మారిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే హృదయవిదారకమైన ఓ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన దాసరి సులోచన (62)… కుమారుడితో కలిసి జీవిస్తున్నది. ఆదివారం అర్ధరాత్రి ఆమె మూతి వంకర పోయి, శరీరం బిగుసుకు పోయింది. ఆమె కుమారుడు గమనించి చుట్టూ పక్కల వారిని పిలిచాడు. ఆమెకు పక్షవాతం వచ్చిందని, గాంధీ దవాఖానకు తరలించారని స్థానికులు సలహా ఇచ్చారు.
రాత్రి ఒంటి గంటకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే రాలేదు. ఆలస్యం చేయకుండా బైక్ మీదనే హుటాహుటిన తన తల్లిని సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించాడు. తల్లిని కాపాడుకోవాలనే ఆతృతతో అక్కడికి వెళ్లిన అతడికి నిరాశే ఎదురైంది. బెడ్స్ ఖాళీగా లేవని, మరో దవాఖానకు తరలించాలని వైద్యులు చేతులెత్తేశారని తెలిసింది. ‘మా అమ్మకు వైద్యం చేయండి సారూ’ అని కనపడిన ప్రతీ డాక్టర్‌ను కాళ్లావేళ్లా పడి వేడుకున్నాడు. అయినా ఒక్కరు కనికరించలేదు. రాత్రి నుంచి తెళ్లవారే వరకు అక్కడే వేచి ఉన్నారు. పొద్దున్నే మళ్లీ డాక్టర్లను కలిశాడు. ‘మా అమ్మను బతికించండి సారూ’ అంటూ మళ్లీ వేడుకున్నాడు. ‘బెడ్లు ఖాళీ లేవు వెళ్లిపోండి’ అంటూ వైద్యులు అదే మాట మళ్లీ మళ్లీ చెప్పారని తెలిసింది.
వైద్యం చేయించాలని సీఎంకు మొర
అనారోగ్యానికి గురైన తన తల్లిని తెళ్లవారిన తర్వాతైనా దవాఖానలో జాయిన్ చేసుకుంటారని బాధితురాలి కుమారుడు నిరీక్షించాడు. కానీ వైద్యులు బెడ్ లేదనే సమాధానమే చెప్పడంతో తన తల్లిని బైక్ మీద ఎక్కించుకొని నేరుగా సెక్రటేరియట్‌కు చేరుకున్నా డు. స్థానిక దుకాణం వాళ్లు ఒక చెయిర్ ఇచ్చారు. ఆమెను చెయిర్ మీద కూర్చోబెట్టిన యువకుడు ‘సీఎం రేవంత్‌రెడ్డి గారు… నేను, మా అమ్మ ఇద్దరం నీకే ఓటేసినం. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, గాంధీ దవాఖానకు తరలిస్తే బెడ్ లేదని డాక్టర్లు చెప్పిండ్రు, మీరే వైద్యం చేయించాలి’ అని గట్టిగా అరిచి మొరపెట్టుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు మీడియా ప్రతినిధులు వచ్చేలోపు అంబులేన్స్‌ను తెప్పించి ఆమెను గాంధీ దవాఖానకు తరలించినట్టు తెలిసింది. ఈ హృదయవిదారకమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ పాలనలో పేదల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని నెటిజన్లు సర్కారుపై విమర్శలు చేస్తున్నారు.