Rivers Interlinking | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): గోదావరిలో మిగులు జలాలు లేవని ట్రిబ్యునల్ ఏనాడో తేల్చిచెప్పింది. ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనాలూ జలాల లభ్యత తగ్గిందని స్పష్టంచేస్తున్నాయి. అయినా దశాబ్దాల నాటి గణాంకాలతో కేంద్రం హడావుడిగా ముందుకుసాగుతున్నది. బ్రహ్మపుత్ర నుంచి గంగా నదికి, అక్కడినుంచి సుబర్ణరేఖ మీదుగా మహానదికి, ఆపై మహానది నుంచి గోదావరికి, తుదకు గోదావరి నుంచి కావేరికి జలాలను మళ్లిస్తామని ఇంతకాలం చెప్పింది. కానీ, ఇప్పుడు ఆ మాటలన్నీ పక్కనపెట్టి ్టచివరి గోదావరి-కావేరి లింక్‌ను మాత్రమే చేపట్టేందుకు ఆగమేఘాల మీద సిద్ధమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలు, డిమాండ్లను తుంగలో తొక్కతూ ఎంవోయూలకు సిద్ధమవుతున్నది. ప్రాణహిత జలాలనే మళ్లించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీబీ (గోదావరి-బనకచర్ల) లింక్ ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై నీటి రంగనిపుణులు మండిపడుతున్నారు.
మొదలు వదిలి..
వృథాగా సముద్రంపాలయ్యే నదీజలాలను తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న ప్రాంతాలకు మళ్లించి సస్యశ్యామలం చేయాలన్నదే నదుల అనుసంధాన ప్రాజెక్టు లక్ష్యం. ఆశయం గొప్పదే అయినా ఎలాంటి ప్రణాళికలు లేకుండా, కేంద్రం ఇష్టానుసారం ముందుకు సాగుతుంటడమే ఆందోళనకరం. నదుల అనుసంధానం చేపట్టాలనే ఆలోచనను దశాబ్ధాల క్రితం నుంచి చేసినా 2002లో నాటి ఎన్డీఏ ప్రభు త్వం అడుగులు వేసింది. రివర్ లింకింగ్ ప్రాజెక్టుల కోసం 2003లో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. హిమాలయ, ద్వీపకల్ప నదుల్లో మొ త్తంగా 30 నదులను అనుసంధానించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
అందులో మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదు ల అనుసంధానం ఒకటి. ఫేజ్-1లో భాగంగా తొలుత వేలాది టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్న బ్రహ్మపుత్ర నదీ జలాలను గంగానదికి మళ్లించాలి. అక్కడినుంచి దామోదర్, సుబర్ణరేఖ నదుల మీదుగా దాదాపు 390 టీఎంసీల జలాలను మహానదికి మళ్లించాలి. ఒడిశా నీటి అవసరాలు తీరిపోయిన తర్వాత ఫేజ్-2లో భాగంగా మహానది నుంచి దాదా పు 230 టీఎంసీల జలాలను గోదావరికి మళ్లించాలి. చివరగా ఫేజ్-3లో భాగంగా గోదావరి నుంచి జలాలను కృష్ణాకు, ఆపై పె న్నా-కావేరి నదులకు మళ్లించాలి. ఇదీ వాస్తవ ప్రణాళిక. కానీ కేంద్రం ప్రస్తుతం ఫేజ్-1, ఫేజ్-2 ఊసే ఎత్తడం లేదు. ఫేజ్-3లో భాగంగా గోదావరి-కావేరి లిం క్పైనే ముమ్మర కసరత్తు చేస్తున్నది. త్వరలోనే తుది సమావేశాన్ని నిర్వహించి రాష్ర్టాలతో ఎం వోయూలను కుదుర్చుతామంటూ ఇటీవల కేంద్రమే వెల్లడించింది.
ప్రాణహిత జలాలపైనే కన్ను..!
కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత జలాలను తరలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని నీటిరంగ నిపుణులు వివరిస్తున్నారు. అం దులో భాగంగానే తొలుత గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైందని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా మహానది నుంచి 234 టీఎంసీలు, గోదావరి నుంచి 324 టీఎంసీలను మళ్లించాలని తొలు త ప్రణాళికలను రూపొందించారు. అయితే మిగుల జలాల తరలింపునకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఒడిశా ఇప్పటికే స్ప ష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును గోదావరి నుంచి చేపట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. 1989 వాటర్ బ్యాలెన్స్ స్టడీ రిపోర్టు ప్రకారం ఇచ్చంపల్లి వద్ద 718 టీఎంసీల మిగులు జ లాలు ఉన్నాయని ఎన్‌డబ్ల్యూడీఏ చెప్తున్నది. 2004-05 అధ్యయనం సైతం ఇవే లెక్కలు వెల్లడించింది.
అయితే, 2015లో ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించిన నివేదిక మాత్రం ఎస్సారెస్పీ నుంచి ఇచ్చంపల్లి వరకు 177 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలు మొత్తంగా 324 టీఎంసీలే మిగులు ఉంటాయని తేల్చిం ది. ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలకు బేసిన్‌లోని రాష్ర్టాలన్నీ కొట్టిపారేశాయి. మిగులు జలాలు ఉండబోవని స్పష్టంచేశాయి. అయినప్పటికీ నీటిలభ్యతపై ఎలాం టి అధ్యయనం చేయించకుండా కేంద్రం మరో ఎత్తుగడ వేసిం ది. ప్రాణహితలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలను తొలిదశలో కావేరికి మళ్లిస్తామంటూ కొత్తపాట అందుకున్నది. రా ష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ యుద్ధప్రాతిపాదికన చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇరిగేషన్‌కు సంబంధించి రీ జనరేటెడ్ వాటర్‌ను ఎక్కడా పరిగణనలోకి తీసుకోకూడదంటూ సీడబ్ల్యూసీ నిర్దేశిస్తున్నది. కానీ, అందుకు విరుద్ధంగా రీ జనరేటెడ్ వాటర్ ఆధారంగా జీసీ లింక్‌ను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుండటం నిబంధనలను తుంగలో తొక్కుతున్న తీరుకు నిదర్శనం.
తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ..
గోదావరి నీటి లభ్యత గణాంకాల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే బేసిన్‌లోని రాష్ర్టాలకు పంపిణీ చేసింది. శాస్త్రీయమైన పద్ధతిలో, సబ్బేసిన్ల వారీగా ఆయా నదుల్లోని మిగుల జలాల గణాంకాలను సేకరించకుండా కేంద్రం ముందుకుపోతున్నది. గోదావరి బేసిన్‌లోని తెలంగాణతోపాటు ఇతర రా ష్ర్టాల్లోనూ దుర్భిక్ష ప్రాంతాలున్నాయి. వాటి నీటి అవసరాలు తీర్చకుండానే, మరో బేసిన్‌కు నీటిని తరలించాలని కేంద్రం పూనుకోవడంపై నీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా రు. భవిష్యత్‌లో బేసిన్‌లోని రాష్ర్టాలకు, బేసిన్ వెలుపలి రాష్ర్టాలకు మధ్య నీటి వివాదాలకు ఆజ్యం పోస్తుందని, అందుకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల వినియోగంలో తలెత్తుతున్న వివాదాలనే ఉదాహరణగా చూ పుతున్నారు. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1,480 టీ ఎంసీలు. అందులో తెలంగాణ వాటా 968 టీఎంసీలు. ఏపీ వా టా 512 టీఎంసీలు.
ట్రిబ్యునల్ కల్పించిన నీటి హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లకూడదు. ట్రిబ్యునల్ కల్పించిన హక్కులకు రక్షణ కల్పించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి సమ్మక్కసాగర్, సీతారామ తదితర ప్రాజెక్టుల డీపీఆర్‌లను క్లియర్ చేయకుండానే కేంద్రం జలాల మళ్లింపునకు పూనుకుంటున్నది. ప్రాజెక్టును సమ్మకసాగర్ నుం చి, లేదంటే ఇచ్చంపల్లి నుంచి చేపడతామం టూ పలువిధాలుగా ప్రకటించింది. ఈ అంశంపై ఎలాంటి స్పష్టత లే దు. సమక్కసాగర్ దిగువన తెలంగాణకు దాదాపు 150 టీ ఎంసీల వినియోగాలున్నా యి. ఒకవేళ సమ్మక్కసాగర్ నుంచి జలాలను తరలిస్తే తెలంగాణ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే జీసీ లింక్ ద్వారా 148 టీఎంసీలను మళ్లించాలనేది ప్రతిపాదన. అయితే ఆ జలాలకు తెలంగాణ వాటాను 27 శాతానికి పరిమితం చేసింది. కానీ, ఇంద్రావతి, దిగువ ఉప-బేసిన్లలో లేని కర్ణాటక రాష్ట్రానికి 16 టీఎంసీలను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. అది ఇటు గోదావరి మాత్రమే కాదు కృష్ణా నది నుంచి తెలంగాణకు వచ్చే ప్రవాహాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
రాష్ర్టాలతో ఒప్పందాలకు కేంద్రం సిద్ధం
జీసీ లింక్‌పై బేసిన్‌లోని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలతో ఒప్పందాలను కుదిర్చేందుకు కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ర్టాలు సంతకాలు చేసినట్టు సమాచారం. ఇటీవల జీసీ రివర్లింక్ ప్రాజెక్టుపై ఎన్‌డబ్ల్యూడీఏ ఢిల్లీ నుంచి హైబ్రిడ్మోడ్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగానే ఆయా రాష్ర్టాల ప్రతిపాదనలపై కేంద్ర జల్‌శక్తి శాఖ బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రాలన్నీ ఎవరికివాళ్లు ఎకువ వాటాలు అడిగితే నీళ్లు ఎకడి నుంచి తెచ్చిస్తారని అసహనం వ్యక్తం చేసింది. అందుబాటులో ఉన్నదే 148 టీఎంసీలని, రాష్ట్రాల డిమాండ్లు చూస్తే 400 టీఎంసీలైనా సరిపోవంటూ మండిపడింది. రాష్ట్రాలు కావాలనుకుంటే ఇంట్రాలింకింగ్ (రాష్ట్రం లోపల చేపట్టే అనుసంధానం) ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ఉచిత సలహా ఇచ్చింది. త్వరలోనే అన్ని రాష్ట్రాల సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులోనే జీసీ అనుసంధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏకపక్షంగా ప్రకటించింది. కేంద్రం తీరు చూస్తుంటే, ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకు పోయే యోచనలో ఉన్నట్టు అర్థమవుతున్నది. కేంద్రం ఏపీకి సహకారం అందిస్తున్నదని, అయినా తెలంగాణ సర్కారు నోరుమెదపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.