దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నింటికీ ఏకీకృత విధానాన్ని అమలుచేసేందుకు ప్రవేశపెట్టిన ‘వాహన్ సారథి’ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో రవాణాశాఖ అందించే పౌరసేవలు మరింత పారదర్శకం కానున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఇకపై వాహనం కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానున్నది. లెర్నింగ్ లైసెన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాలనికి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహనాల నమోదు, బదిలీ తదితర సేవలు వినియోగదారులకు మరింత చేరువకానున్నాయి. ప్రస్తుతం టీ-యాప్, ఫోలియో వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ప్రత్యక్ష సేవలను పొందేందుకు అవకాశం ఉండగా, త్వరలో ‘వాహన్ సారథి’ అందుబాటులోకి రానున్నది.
లెర్నింగ్ లైసెన్స్‌ల పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతుండటంతో హైదరాబాద్‌లోనూ ఆన్లైన్ టెస్టింగ్ విధానాన్ని అమలుచేయాలని రవాణా అధికారులు యోచిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసెన్స్) పొందవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం టెస్ట్ట్రాక్లో ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాలి.
సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే ‘సారథి’ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ‘సారథి’ కార్యకలాపాలు సాగిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలు సారథిలో నమో దు కాగా, ఇటీవల మన రాష్ట్రం కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకొనే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్ చేసుకోవడం, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి ద్వారా పొందే వీలున్నది. లైసెన్స్‌ల మొత్తం డాటా సారథిలో నిక్షిప్తమై ఉంటుంది.
దేశంలోని మెజారిటీ రాష్ర్టాలు వాహనాల వివరాలను ‘వాహన్’లో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘వాహన్’లో ఇటీవల తెలంగాణ కూడా చేరేందుకు చర్యలు చేపట్టింది. దీంతో వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను(టీఆర్) ఇస్తున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ (ఆర్సీ) చేస్తున్నారు. ఇకపై వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి బదిలీ చేసేందుకు ఎన్వోసీ అవసరం లేకుండా ‘వాహన్’లో ధ్రువీకరించుకొని బదిలీ చేయవచ్చు. ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుంది.