HMDA | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధాన లోపంతో హైదరాబాద్ మహాభివృద్ధి సంస్థలో ఆదాయం పడిపోతున్నది. పదేండ్లపాటు హైదరాబాద్ వేదికగా రియల్ ఎస్టేట్ రంగం 3 హైరైజ్ ప్రాజెక్టులు, 6 అపార్టుమెంట్లు అన్న చందంగా గణనీయంగా వృద్ధి చెందింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పకూలింది. హెచ్ఎండీఏకు రావాల్సిన ఆదాయం క్రమంగా తగ్గిపోతున్నది. ఆదాయం తీసుకువచ్చే ప్లానింగ్ విభాగం ద్వారా నెలకు సగటున రూ.110 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర ఆదాయం సమకూరేది. కానీ గడచిన ఆరేడు నెలలుగా అనుమతులు నిలిచిపోవడంతో హెచ్ఎండీఏకు ఫీజుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నది. సకాలంలో అనుమతులు మంజూరు కాకపోవడం, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన డ్యామేజీ రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. హెచ్ఎండీఏ నెలవారీ ఆదాయం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పడిపోయింది.
మహా భాగ్యం.. మహా సంక్షోభం
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏకు నిర్మాణ రంగం ద్వారా ఆదాయం సమకూరేది. భవన నిర్మాణం, వెంచర్ అనుమతులతో ఫీజుల రూపంలో భారీ మొత్తంలో ఆదాయం వచ్చేది. ప్రాజెక్టు విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు మీద తక్కువలో తక్కువ కోటిన్నరకు పైగా రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఈ లెక్కన ప్రతి నెలా అనుమతులు కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 150-200కు పైగా ఉండేది. కానీ గడిచిన కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన స్తబ్ధత అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులపై ప్రభావం చూపుతున్నది. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు ఒక్కసారిగా 60శాతానికి పైగా పడిపోయాయి. హెచ్ఎండీఏ పరిధిలో డెవలప్మెంటల్ ఛార్జీల రూపంలో భారీగా వచ్చే ఆదాయం కూడా తగ్గింది.
అసలే సంక్షోభం.. ఆపై నిర్లక్ష్యం
రియాలిటీ రంగంలో ఏర్పడిన స్తబ్ధత కారణంగా మార్కెట్ మందగించింది. కానీ వచ్చిన దరఖాస్తులను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. సకాలంలో అనుమతులు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళ దరఖాస్తు చేసిన షార్ట్ ఫాల్స్ రూపంలో అధికారులు పెట్టే కొర్రీలతో దరఖాస్తుదారులు భయపడిపోతున్నారు. ఇక బడా ప్రాజెక్టులకు అయితే కింది స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా ఉన్నతాధికారులు కనుసన్నల్లోనూ జరిగిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఆదాయాన్ని తీసుకువచ్చే హైరైజ్ ప్రాజెక్టుల అనుమతు విషయంలో హెచ్ఎండీఏ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎంఎస్బీ సమావేశాలు సకాలంలో నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో అనుమతులు నిలిచిపోయి, ప్రాజెక్టుల పేరిట వచ్చే రెవెన్యూ ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో టీఎస్‌బీపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా అనుమతులు జారీ చేసే ప్రక్రియ ఉండేది. ఇప్పటికీ ఆన్లైన్ విధానంలోనే అనుమతులు జారీ చేస్తున్నా… సమాంతరంగా ఆఫ్‌లైన్ విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దరఖాస్తు చేసి కూర్చుంటే నేరుగా అనుమతులు వచ్చే పరిస్థితి లేదని కొందరు బిల్డర్లు వాపోతున్నారు. ఆటోమోడ్ విధానాన్ని ప్రభుత్వం తొక్కి పెట్టడంతోనే అనుమతుల జారీలో జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు.
గతమెంతో ఘనం.. నేడు గగనం
హెచ్ఎండీఏకు ఒకప్పుడు ప్రాజెక్టుల అనుమతుల ద్వారా నెలకు రూ.110 కోట్ల నుంచి రూ.150 కోట్లు సమకూరేది. ఓసారి రూ.200 కోట్లు కూడా వచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి అధికంగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం సగానికి పైగా పడిపోయింది. నాలుగు నెలలుగా ఫీజుల రూపంలో వచ్చే రెవెన్యూ తగ్గిపోయింది. ప్రభుత్వ విధానాలే అత్యంత ప్రతికూలంగా మారినట్టు అధికారులు కూడా చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతోనే ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిందని ఓ సీనియర్ అధికారి అన్నారు.