రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా రూ.వేల కోట్లు దోచుకునే వ్యూహాన్ని పక్కాగా ఎలా అమలు చేస్తున్నారు? జాతీయ స్థాయిలో రెండు పార్టీలు ఉప్పు, నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా రెండుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఒక బీజేపీ ప్రజాప్రతినిధి ఇంత బహిరంగంగా తప్పు చేస్తున్నా, దానికి సంబంధించిన ఆధారాలు బయటపడినా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలివి! వీటికి సమాధానం వెతికేందుకు ‘నమస్తే తెలంగాణ’ లోతుగా పరిశీలించగా రెండు పార్టీల మైత్రి బయటపడింది. ముఖ్యనేత కోటరీకి, పాయల్ శంకర్‌కు మధ్య ఉన్న దశాబ్దాలనాటి బంధం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓబులాపురం గనుల కుంభకోణం సమయంలో కుదిరిన దోస్తీ.. ఇప్పుడు ఆదిలాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్ రూపంలో కాంగ్రెస్-బీజేపీ ప్రజాప్రతినిధులకు వెలుగులు పంచేందుకు సిద్ధమైంది.
స్పెషల్ టాస్క్బ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లోనే కాదు..తెలంగాణ రాజకీయాల్లోనూ అందరినీ విస్మయానికి గురి చేస్తున్న ‘జనక్ జనక్ పాయల్ పాజే’ వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పదివేల ఎకరాల్లో ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ రూపంలో ‘ముఖ్యనేత’ కోటరీతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేసిన భారీ స్కెచ్‌ను తవ్వితే చివరికి అది ఓబులాపురం గనుల వద్దకు వెళ్లడం ఆసక్తి కలిగించే అంశం. ఆ ఓబులాపురం బంధమే ఇప్పుడు రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తెచ్చింది. జాతీయ స్థాయిలో భిన్న ధ్రువాలైన కాంగ్రెస్-బీజేపీ మధ్య రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఆదిలాబాద్ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు వెనుక ఓవైపు పరిహారం, కేంద్ర నిధులు, లే అవుట్ అభివృద్ధి రూపంలో వచ్చే దాదాపు రూ.20 వేల కోట్లతో పాటు భారీ ఎత్తున మైనింగ్ దందా కొనసాగించే దీర్ఘకాలిక వ్యూహం అసలు కారణంగా తెలుస్తున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఓబులాపురం గనుల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఓబులాపురం గనులపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. మరోవైపు అప్పటి టీడీపీ నేతలు ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆరా తీశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ‘ముఖ్యనేత’తోపాటు ఆయన కోటరీలోని పాత టీడీపీ నాయకులు కూడా ఓబులాపురం మైనింగ్ కుంభకోణంపై పరిశోధనలు చేశారు. పాయల్ శంకర్‌కు అప్పటికే భూముల క్రయ, విక్రయాలతో పాటు మైనింగ్‌లోనూ అనుభవం ఉన్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్లోని ఓ బ్లాక్‌స్టోన్ కంపెనీలో పాయల్ శంకర్‌కు గతంలో భాగస్వామ్యం ఉండేదని సమాచారం. దీంతో ఆయన అనుభవాన్ని కొందరు టీడీపీ నేతలు ఓబులాపురం అంశంలో వాడుకున్నారని తెలిసింది. ఆ సమయంలోనే ‘ముఖ్యనేత’ కోటరీలోని ప్రధాన నేతలతో పాయల్ శంకర్‌కు సత్సంబంధాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఆ బంధం ఇప్పుడు ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్‌లో దీర్ఘకాలిక ‘మైనింగ్’ వ్యూహం రూపంలో అమల్లోకి వచ్చినట్టు పాత టీడీపీ నేతలు కొందరు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న భూములు వాస్తవానికి చనాక-కొరాట ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రాజెక్టు ఫలాలు ఆ భూములకు అంది, అవి పచ్చని మాగాణంలా మారాల్సి ఉన్నది. కానీ అందుకు భిన్నంగా సాధ్యమైనంత వరకు ఆ భూములను పిండి సొమ్ము చేసుకొనేందుకు ‘ముఖ్యనేత’ కోటరీతో కలిసి పాయల్ శంకర్ ప్లాన్ చేశారు. ఇందుకు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
బ్యాంకుల్లో తనఖా ఉండి.. ఆపై ఎన్సీఎల్టీ ద్వారా బెంగళూరు కంపెనీకి దక్కాల్సిన భూములను పెద్ద ఎత్తున పాయల్ శంకర్ తన బంధువులు, అనుచరులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన విషయం ఇప్పటికే బట్టబయలైంది. గతంలో రూ.30-40 వేలకు కొనుగోలు చేసిన ఆ భూములకు ఇండస్ట్రియల్ పార్కు భూ సేకరణ రూపంలో ఎకరాకు రూ.18 లక్షల వరకు పరిహారం అందనున్నది. ఇలా రూ.వందల కోట్లు వారి జేబుల్లోకి పోనున్నాయి.
వెయ్యి ఎకరాలు దాటిన ఇండస్ట్రియల్ పార్క్ భూములకు కేంద్ర ప్రభుత్వం ‘భవ్య’ పథకం కింద ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇవ్వనున్నది. వీటితోపాటు పార్కు లే అవుట్ అభివృద్ధి రూపంలోనూ రూ.వేల కోట్ల నిధులు అక్కడ ఖర్చు చేయనున్నారు. టెండర్ల ద్వారా ఆ పనుల్లోనూ భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు స్కెచ్ వేసినట్టు చెప్తున్నారు.
లే అవుట్ అభివృద్ధి తర్వాత మూడో అంచెలో ‘మైనింగ్’ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారో ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ కోటరీనే వివిధ కంపెనీల పేరిట ఇండస్ట్రియల్ పార్క్‌లోని భూములను సొంతం చేసుకొని, పెద్ద ఎత్తున మైనింగ్ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న భూముల్లో పెద్ద ఎత్తున సున్నపురాయి, మాంగనీస్ నిక్షేపాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు. ‘ఓబులాపురం’ అనుభవం, అప్పుడు కుదిరిన దోస్తీని ఉపయోగించుకొని అక్కడ మైనింగ్ చేసి, దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసమే ముందుగా డెక్కన్ సిమెంట్స్ కంపెనీని రంగంలోకి దింపి, ఆ కంపెనీ పేరిట వంద ఎకరాలకు పైగా భూములను బదలాయించారని చెప్తున్నారు. భవిష్యత్తులో పార్క్ ఏర్పాటుకు ఆ కంపెనీ తన భూములు ఇచ్చిందనే పేరుతో, ప్రాధాన్యం ఇస్తూ మైనింగ్ ప్లాన్‌ను అమలు చేసేలా ఈ కోటరీ తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టు స్పష్టమవుతున్నది.