లండన్: చరిత్రలో తొలిసారి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసిన బిట్ కాయిన్.. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో తగ్గుముఖం పట్టింది. శనివారం ట్రేడింగ్‌లో 61,742 డాలర్లు తాకిన బిట్ కాయిన్ విలువ సోమవారం ఉదయం 10.56 గంటలకు లండన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 56,325 డాలర్లకు పడిపోయింది. శనివారం ఆల్‌టైం రికార్డుతో పోలిస్తే 9.2 శాతం పతనం.
అమెరికా సహా పలు దేశాలు కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజానికి ప్రకటించిన ఉద్దీపనల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ విలువ ఆల్‌టైం రికార్డులకు దూసుకెళ్లడం గమనార్హం. బిగ్ ర్యాలీ తర్వాత బిట్ కాయిన్లో ఇటువంటి కన్సాలిడేషన్ సాధారణమేనని క్రిప్టో వాలెట్ ఎక్స్చేంజ్ జుమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ జోన్స్ వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి బిట్ కాయిన్ విలువ 1000 శాతం పెరిగింది.