హైదరాబాద్, మే 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో ఓ ఉన్నతాధికారి ఉద్యోగ విరమణ పొందాక మరో పోస్టు కొట్టేసే పనిలో ఉన్నారు. ఈ విషయం ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రిటైర్మెంట్ గడువుకు నెల ముందే ఉద్యోగ విరమణ తర్వాత కన్సల్టెంట్ పేరుతో మరో ఉద్యోగంలో చేరే కోరికతో ఏకంగా ఫైల్‌ను సిద్ధం చేయించడం ఆశ్యర్యం కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను రిటైర్మెంట్ తర్వాత ఇతర విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయించింది. కీలక స్థానాల్లో ఉన్నవారిని అవసరం మేరకు తప్ప ఇతరులెవరినీ తీసుకోవద్దని నిబంధనలు విధించింది. వీటిని తుంగలో తొక్కి టీజీపీసీబీలో మే 31న ఉద్యోగ విరమణ పొందనున్న ఆ ఉన్నతాధికారి.. హడావుడిగా టీజీపీసీబీలోనే మరో ఉన్నత పోస్టు అయిన సైంటిఫిక్ కన్సల్టెంట్ కోసం దొడ్డిదారిన చకచకా పావులు కదుపుతున్నట్టు విస్తృత చర్చ జరుగుతున్నది. టీజీపీసీబీ మెంబర్, సెక్రటరీ త్వరలో సెలవుపై వెళ్లే అవకాశం ఉన్నదని, ఈ లోపే ఫైల్‌పై సంతకం చేయించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.
ఉద్యోగులు, సిబ్బంది నుంచి వ్యతిరేకత
సీనియర్ శాస్త్రవేత్త అయిన ఆ ఉన్నతాధికారి తన విధుల్లో ఏనాడూ సక్రమంగా లేరని, అత్యంత అసమర్థ అధికారి అని ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆయన తన విధులపై, కాలుష్య నియంత్రణ విధులపై క్రియాశీలకంగా వ్యవహరించలేదనే అభిప్రాయం ఉన్నది. ఇలాంటి అధికారి విరమణ పొందాక, మరో ఉన్నత పదవి కట్టబెడితే సంస్థ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయనకు ఎలాంటి అవకాశం కల్పించవద్దని కోరుతున్నారు.