హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కనీస వేతనాల బోర్డు చైర్మన్, సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్ల నేతలను నియమించారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్, సభ్యుడిగా నరసింహారెడ్డి నియామకంపై సమగ్ర వివరాలు నివేదించాలని కోరింది. కార్మిక సంఘాలకు చెందిన వారిద్దరినీ నియమిస్తూ ప్రభుత్వం జీవోలు 143, 21ను జారీచేయడంపై ట్రేడ్ యూనియన్ కార్యకర్త శ్రీ నివాస్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ శ్యాంకోశీతో కూడిన బెంచ్ గురువారం తోసిపుచ్చింది.
పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధిశాఖ ముఖ్య కార్యదర్శి, కార్మికశాఖ కమిషనర్‌తోపాటు జనక్‌ప్రసాద్, నరసింహారెడ్డిలకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చి విచారణ వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. కనీస వేతనాల బోర్డు చైర్మన్, సభ్యుడిగా ఐఎన్టీయూసీ నేత జనక్‌ప్రసాద్‌ను చైర్మన్‌గా, సింగరేణి కాలరీస్ ట్రేడ్ యూనియన్ నేత నరసింహారెడ్డిని సభ్యుడిగా నియమించారని వివరించారు. వాళ్లు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేరని చెప్పారు.