హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ దర్మకుడు రాజమౌళి నిర్మించిన రౌద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్) చిత్రంపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం జీవన విధానాలకు, వారి చరిత్రకు వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించారని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన విద్యార్థిని అల్లూరి సౌమ్య తన పిల్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరాదని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులతోపాటు చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, డీవీవీ దానయ్య, కథా రచయిత కేవీ విజయేంద్రప్రసాద్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఏ వెంకటేశ్వర్‌రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తెలిపింది.