Devadula Project | ఏటూరునాగారం, జూన్ 8: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గోదావరిపై నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకం(ఇన్‌టేక్‌వెల్)వద్ద పూడికతీత పనులు చేపట్టేందుకు బరాజ్‌లో ఉన్న నీటిని వదిలేస్తున్నారు. దేవాదుల ఇన్‌టేక్‌వెల్ ద్వారా నిత్యం నీటిని పంపింగ్ చేసేందుకు అవసరమైన నీటి నిల్వ కోసం తుపాకులగూడెం బరాజ్‌ను గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. బరాజ్ నుంచి దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వరకు నీటినిల్వ ఉండడంతో ఇంతకాలం భీంఘనపూర్లోని రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేశారు. ప్రస్తుతం వానకాలం సమీపిస్తుండడంతో దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద పేరుకుపోయిన ఇసుక, ఒండ్రుమట్టిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఇందుకు తుపాకులగూడెం బరాజ్ వద్ద గేట్లను ఎత్తి ఒక టీఎంసీ నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వచ్చే గోదావరి వరద నేరుగా తుపాకులగూడెం బరాజ్ నుంచి కిందికి ప్రవహిస్తున్నది. ఇన్‌టేక్‌వెల్ నుంచి పంపింగ్ కూడా నిలిపివేశారు.
దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద పూడికతీతకు రూ.30 లక్షలను కేటాయించారు. పనులకు టెండర్లు నిర్వహించారు. ఇన్‌టేక్‌వెల్ వద్ద నీరు పూర్తిగా వెళ్లిపోతేనే సిల్ట్ తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుపాకులగూడెం బరాజ్ గేట్లను సిల్ట్ తీసే వరకు ఎత్తి ఉంటాయని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. పూడికతీత పనులు పొందిన కాంట్రాక్టర్ మిషనరీతో దేవాదుల వద్దకు చేరుకుని వారం రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్న ట్టు అధికారులు పేర్కొంటున్నారు. సుమారు 10 రోజుల సమయం పట్టొచ్చని చెబుతున్నారు. వానకాలం వరద వచ్చేలోపు సిల్ట్ పనులు పూర్తి చేసేందుకు నీటి పారుదలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్‌టేక్‌వెల్ వద్ద ఉన్న గేట్లకు కూడా మరమ్మతు చేయనున్నారు. తుపాకులగూడెం బరాజ్‌ను నిర్మించిన తర్వాత దేవాదుల ఇన్టేక్వెల్లోని పంపుల ద్వారా నీటిని భీంఘనపూర్ రిజర్వాయర్‌కు చేరవేస్తున్నారు. అక్కడ నుంచి ఇతర రిజర్వాయర్లకు నీటి పంపింగ్ జరుగుతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 14 టీఎంసీల నీటిని పంపింగ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.