హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పోలీస్ కొలువు బాటలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ దేహదారుఢ్య పరీక్షలు సజావుగానే కొనసాగుతున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. ఈ ప్రక్రియ జనవరి మొదటి వారంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అన్ని దశల్లోనూ సీసీటీవీ కెమెరాలతో వీడియో తీస్తున్నారు. అభ్యర్థులు ఎవరైనా సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైతే వారికి మరోమారు ఎత్తు కొలిచే వెసులుబాటు కల్పించింది. అనుమానం ఉన్న అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ వద్ద వివరాలు నమోదు చేయాలి. అదేరోజు అభ్యర్థులకు మరోమారు ఎత్తు కొలుస్తారు. సాయంత్రం నిర్ణయాన్ని వెల్లడిస్తారు.