Rain Photos | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో 20 సెంటీమీటర్లు, భైంసాలో 16.8 సెంటీమీటర్లు, జక్రాన్‌పల్లిలో 15.3 సెంటీమీటర్లు, బాసరలో 14.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నిజామాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కుమ్రభీం ఆసిఫాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలుకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది.

ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు గోదావరికి భారీగా వరద వస్తున్నది. గడ్డెన్న వాగు, స్వర్ణ, కడెం జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు నిండగా.. వరద కొనసాగుతుండగా ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు.

కడెం గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద పెరిగింది. దీంతో పదిగేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుండపోత వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఎడతెరిపిలేని వర్షం జనం ఇబ్బందులకు గురయ్యారు. వర్షాలతో పలుచోట్ల జలపాతలు ప్రవహిస్తున్నాయి. కుంటాల, పొచ్చెర, బొగత జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
