హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 6: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో స్టాఫ్ ఫొటో జర్నలిస్టులకు ఫొటో పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు వరంగల్‌లో ఫొటో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఎవరూ కాంపిటీషన్ పెట్టలేదని తమ కమిటీ చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు పోటీల్లో పాల్గొనే ఫొటోగ్రాఫర్లు ఫొటోలు పంపించాలని కోరారు. బెస్ట్ న్యూస్ పిక్చర్, ఫీచర్, కల్చర్ విభాగాలలో 8/12 సైజులలో ఫొటోలను పోటీల కోసం ఆహ్వానిస్తున్నట్లు, ఒక్కొక్కరు 3 ఫోటోలను పంపించవచ్చని తెలిపారు. ఉత్తమ న్యూస్ పిక్చర్‌కు ప్రథమ బహుమతి, ఉత్తమ ఫీచర్ ఫొటోకు ద్వితీయ బహుమతి, ఉత్తమ కల్చర్ ఫొటోకు తృతీయ బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. విజేతలకు ప్రథమ బహుమతికి రూ.10 వేలు, ద్వితీయ రూ.5 వేలు, తృతీయ రూ.3 వేలతో పాటు షీల్డ్, సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని, వీటితో పాటు కన్సోలేషన్ బహుమతి కింద రూ.1000 నగదు, షీల్డ్ అందచేయడం జరుగుతుందని తెలిపారు.
పోటీలలో పాల్గొనే ఫొటో జర్నలిస్టులకు ఫొటోలను నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చని, ఇతర వివరాలకు ప్రెస్ క్లబ్ బాధ్యులు గోకారపు శ్యాం(9000283008), సంపెట సుధాకర్(9985410386), పెద్దపల్లి వరప్రసాద్(9912199869), వీరగోని హరీష్ (9985411670)లను సంప్రదించవచ్చని, పోస్టు ద్వారా పంపేవారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్, ఇంటి నెంబర్:7-1-99/C, ఫైర్‌స్టేషన్ ఎదురుగా, బాలసముద్రం, హనుమకొండ, అడ్రస్‌కు పోస్టు చేయవచ్చని అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్యలు తెలిపారు.