సిరిసిల్ల : కాంగ్రెస్ కీలక నాయకుల బొగ్గు కుంభకోణం ( Coal Scam ) నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ ( Phone tapping ) కేసు వ్యవహరం నడుస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ట్రాష్ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు. సిరిసిల్లలో గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు రావాలని నోటీసులు అందజేయడంపై ఆయన స్పందించారు. సిట్ అనేది రేవంత్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడటానికి, రాష్ట్ర పాలనను దించడానికి చేసే కుట్రలను నివారించడానికి నెహ్రూ కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ నడుస్తుందని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొగిలిరేకుల, కార్తికదీపం సీరియళ్ల గత రెండేళ్లుగా సాగుతుందని విమర్శించారు. సీఎం దావోస్ నుంచి వచ్చేంతవరకు ఈ డ్రామ కొనసాగుతుందన్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను, ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో నెలకొల్పిన జిల్లాల రద్దుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని, జిల్లాలను ఎత్తి వేస్తామంటే బీఆర్ఎస్ సహించేది లేదని హెచ్చరించారు. రెండేళ్లలో ప్రజలకు ఒక్క మంచి పని ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు.రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో కాంగ్రెస్కు చావుదెబ్బ తప్పదని అన్నారు.