హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గౌలిదొడ్డిలోని బాలుర, బాలికల సీవోఈ కేంద్రంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, సంస్థ కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి ‘ఫోన్ మిత్ర’ సేవలను సోమవారం ప్రారంభించారు. తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు ‘ఫోన్ మిత్ర’ అవకాశాన్ని కల్పించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో గురుకులంలో 7 నుంచి 10 టెలిఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారు. నలుగురు విద్యార్థులకు కలిపి ఒక ఫోన్ కార్డు అందించారు. ఆ కార్డును ఉపయోగించి, తల్లిదండ్రులు అనుమతించిన ఫోను నంబరుకు విద్యార్థులు ఉచితంగా రోజుకు ఎన్ని సార్లయినా ఫోను చేసి మాట్లాడుకునే అవకాశం కల్పించారు. కార్డులో రిజిస్టరైన నంబర్లకు మాత్రమే ఫోన్ చేసే అవకాశమున్నది. సహాయ కేంద్రం నంబరుకు కూడా ఫోన్ చేసి గురుకులంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే వెసులుబాటు కల్పించారు.