హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి అధికారులను తొలగించాలి. మేము దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రిటైర్డ్ అధికారులను ప్రభుత్వం నుంచి తొలగించాలి..’ ఇదీ పీసీసీ అధ్యక్షుడిగా, మలాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారుల సర్వీస్ పొడిగింపు విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవే విధానాలను కొనసాగిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖలో ప్రస్తుతం ఎక్స్టెన్షన్ పర్వం జోరుగా సాగుతున్నది. ఒకప్పుడు ‘ఉద్యోగ విరమణ చేసిన వారికి మళ్లీ పదవులా?’ అని ప్రశ్నించిన గొంతులే ఇప్పుడు వారికి జీవనదాతలుగా మారడం సచివాలయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పీఆర్ఆర్డీశాఖలో ఇప్పటికే నలుగురు కీలక అధికారులకు ఉద్యోగ విరమణ గడువు పొడిగించారు. తాజాగా, ఏప్రిల్ 30వ తేదీతో ఉద్యోగ విరమణ చేయాల్సిన మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లు కూడా తమ ఉద్యోగాలను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
నిలిచిపోతున్న ప్రమోషన్లు
అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు కుర్చీలకు అతుకుపోవడంతో, కిందిస్థాయిలో ఉన్న అర్హులైన అధికారులకు ప్రమోషన్లు దకడం లేదు. ఇది వారి కెరీర్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, వారిలో తీవ్ర నిరాశను నింపుతున్నది. ప్రభుత్వంలోని కీలకశాఖల్లో ఉద్యోగ విరమణ పొందిన వారు తిరిగి చక్రం తిప్పుతుండటంతో, సర్వీసులో ఉన్న జూనియర్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలాఖరుతో ఖాళీ కానున్న కీలక పోస్టుల కోసం మళ్లీ పాతవారే పైరవీలు చేస్తున్నారనే వార్తలు ఉద్యోగవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికైనా రిటైర్డ్ అధికారులకు రెడ్ కార్పెట్ సంస్కృతికి స్వస్తి పలికి, సర్వీసులో ఉన్న అధికారులకు న్యాయం చేయాలని, అప్పుడే పాలనలో పారదర్శకత వస్తుందని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 30 తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి తీరేవేరు..
2009లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన విద్యాసాగర్‌రెడ్డి.. 2010లో మైక్రోఫైనాన్స్ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2010-19 వరకు స్త్రీనిధి సంస్థ ఎండీగా ఉన్నారు. 2019 నుంచి 2023 వరకు రెన్యువల్ కాలేదు. అనంతరం ఒకేసారి మూడేండ్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ విద్యాసాగర్‌రెడ్డిని టర్మినేట్ చేశారు. నిధుల దుర్వినియోగం విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్‌రెడ్డి ఏండ్లుగా స్త్రీనిధి ఎండీగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మే 23వ తేదీతో ఆయనకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ ముగియనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఏండ్లుగా అక్కడే తిష్ట
మిషన్ భగీరథ విభాగంలో ఈఎన్సీ/సీఈ/క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ)గా పనిచేస్తున్న జీ కృపాకర్‌రెడ్డి వాస్తవానికి 2017లోనే పదవీ విరమణ పొందారు. అయితే, గత 8-9 ఏండ్లుగా ఆయన పదవీకాలాన్ని వరుసగా పొడిగిస్తూనే ఉన్నారు. ఈ ఒక అధికారి పదవిలోనే కొనసాగుతుండటం వల్ల, ఆ స్థానానికి అర్హులైన సుమారు ఏడుగురు చీఫ్ ఇంజినీర్లు ప్రమోషన్లు రాక ఆవేదన చెందుతున్నారు. ఇది ఆ విభాగంలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నది. ఈ నెల 30వ తేదీతో కృపాకర్‌రెడ్డి ఎక్స్టెన్షన్ గడువు ముగియనున్నది. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు దాదాపు ఏడేండ్ల్ల క్రితమే పూర్తయినప్పటికీ, భారీ సంఖ్యలో ప్రాజెక్ట్ సిబ్బందిని, అధికారులను ఇంకా కొనసాగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
30తో ముగియనున్న పీఆర్ఈఎన్సీ గడువు
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా గత ఏడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన జోగారెడ్డి.. పదవీకాలం అక్టోబర్ 31వ తేదీతో ముగిసింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ నెల 30వ తేదీతో పొడిగించిన ఆరునెలల ఎక్స్టెన్షన్ ముగియనున్నది. పీఆర్లో చీఫ్ ఇంజినీర్లుగా ఉన్న ఏడుగురు అధికారులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో తన పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పీఆర్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.