హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఫార్మసీలో డిప్లొమా ఫెయిలైన విద్యార్థులకు కూడా అక్రమంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేశారని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ మాజీ రిజిస్ట్రార్, ప్రస్తుతం డీసీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జీ రామ్దాన్ 2021-22 మధ్యకాలంలో వందల మందికి దొడ్డిదారిన ‘రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్’ సర్టిఫికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్రకు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అధ్యక్షుడు మోంటు ఎం పటేల్‌కు, పీసీఐ రిజిస్ట్రార్ అనిల్ మిట్టల్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు గురువారం తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారని గుర్తు చేశారు. అలాంటిది అర్హత లేనివాళ్లు ఫార్మసిస్టులుగా చెలామణి అవుతూ, ఒక మందుకు బదులుగా వేరేవి ఇస్తే ఎంత ప్రమాదకరమో ఆలోచించాలని కోరారు. ఫెయిలైన వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే ఇక కాలేజీలు, లెక్చరర్లు, నియమనిబంధనలు ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంజయ్‌రెడ్డి కోరారు.