కొడంగల్, నవంబరు 21: రైతులకు ప్రభుత్వం నచ్చజెప్పి భూములు అప్పగించే విధానాన్ని అవలంభించాలని, బలవంతంగా భూసేకరణ చేపడితే రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గురువారం కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని ఫార్మా బాధిత గ్రామాలు, పొలాలను సందర్శించి బాధితుల ఆవేదనను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు పండించే భూమిలోనే ఫార్మా కంపెనీల ఏర్పాటు విడ్డూరంగా ఉందని, వెంటనే ఫార్మా ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అనుకూలంగాలేని భూముల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. కొడంగల్ ప్రాంతంలో1156 ఎకరాల సీలింగ్ భూమి ఉందని, ఆ భూమిని కాదని గిరిజనులు, పట్టాభూముల స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కలెక్టర్‌ను గుర్తించని సందర్భంలో ఘటన జరిగిందని, అటువంటి దానిపై ప్రభుత్వం రాద్ధాంతం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను అర్ధరాత్రి ఇండ్లలోకి జొరబడి అరెస్టులు చేయడం అమానుషమని పేర్కొన్నారు. అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భూములు ఇచ్చే ప్రసక్తే లేదు
సీపీఎం నాయకులు ఫార్మా బాధిత గ్రామాలను సందర్శించిన సందర్భంగా మా భూములను ప్రభుత్వానికి అప్పగించేది లేదని రైతులు స్పష్టం చేశారు. భూములపైనే తమ జీవనాధారం ఉందని, భూమి పోతే ప్రాణాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తే మా బతుకుల్లో కన్నీరు నింపుతాడని అనుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ, న్యూ డెమాక్రసీ రాష్ట్ర నాయకులు పాపన్న, గోవర్ధన్, సీపీఐ నాయకులు రమా, అన్వేశ్, జిల్లా సెక్రటరీ విజయలక్ష్మి, సీపీఎం నాయకులు నర్సిములు, వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి మహిపాల్, కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు.