హైదరాబాద్/రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు ఫార్మాసిటీ రైతులు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తమకు చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్న అన్నదాతలు.. ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. పోటీ చేసేందుకు అవసరమైన సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్ కాపీలు ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం ఆర్డీవో మూడు రోజులుగా జాప్యం చేస్తూ అడ్డంకులు సృష్టించగా.. ఎట్టకేలకు ‘నమస్తే తెలంగాణ’ చొరవతో శనివారం రాత్రి 12 మందికి ఆగమేఘాల మీద అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే అధికారులు ఆలస్యం చేశారని.. నామినేషన్లు అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని రైతులు హెచ్చరించారు.
ఫార్మా సిటీ బాధితుల్లోని 12మంది రైతు లు 12న ఎలక్టోరల్ రోల్స్ సర్టిఫికెట్ కోసం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లా రు. ఆర్డీవో అందుబాటులో ఉండకపోవడం తో రైతులు ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. రైతులంతా శనివారం ఉద యం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినా ఆయన రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి కారణాలేమిటని ‘నమస్తే తెలంగాణ’ ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులను నిలదీసింది. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రైతులు ఫ్యాక్స్ ద్వారా ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో దిగొచ్చిన ఆర్డీవో, అధికారులు చేసేదేమీ లేక ఆగమేఘాల మీద శనివారం ఎలక్టోరల్ రూల్స్ ఫైళ్లను తెప్పించుకొని సంతకాలు పెట్టి సర్టిఫికెట్లు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వెయ్యి మందితో ప్రచారం చేసి, ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఫార్మాసిటీ రైతులు చెప్తున్నారు. తమకు న్యాయం చేస్తామని మాటిచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేసింది. భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చిన నేతలంతా మా ఓట్లతో అధికారంలోకి వచ్చి విస్మరించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసి వారికి తగిన గుణపాఠం చెప్తాం. రేవంత్ రెడ్డి సర్కార్ బండారాన్ని బయటపెడతాం.
– రవీందర్, మేడిపల్లి