జనగామ చౌరస్తా, నవంబర్ 19: లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ చేసిన లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను మంగళవారం ఆయన జనగామ అర్బన్ పోలీస్ స్టేషన్లో కలిసి మద్దతు ప్రకటించారు. లగచర్ల చుట్టుపక్కల ఉన్న ఐదు తండాల్లోకి అర్ధరాత్రి పోలీసు బలగాలు ప్రవేశించి మహిళలని కూడా చూడకుండా వారిపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులను అరెస్ట్ చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. లగచర్ల బాధితులకు మద్దతుగా నిలిచిన ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులను రెండు రోజులుగా అర్ధరాత్రి స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన గిరిజన బిడ్డలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను అడుగుతారనే మాజీ సర్పంచ్‌లను ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేసిందని విమర్శించారు. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామినాయక్, కౌన్సిలర్ అనిత, దయాకర్, కోఆప్షన్ మెంబర్ మసీ ఉర్ రెహమాన్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.