Kodangal | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ‘మా ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు భూమిలిచ్చేది లేదు.. భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తం.. పచ్చని పొలాల్లో చిచ్చుపెట్టి మా పల్లెలను పాడు చెయ్యొద్దు..మా బతుకుల్లో మన్నుపొయ్యద్దు..’ అని ఇక్కడి రైతులు, గిరిజనులు ఎంత మొత్తుకుంటున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ ఎందుకు వాళ్ల వెంటపడుతున్నది? కొడంగల్ నియోజకవర్గ పరిధిలోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు ఎందుకంత ఆరాటపడుతున్నది? రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఔషధ తయారీ కోసం ప్రత్యేక ఫార్మా క్లస్టర్లు ఉన్నా ఇప్పుడు కొడంగల్‌లోనే మళ్లీ భూములెందుకు సేకరిస్తున్నది? స్థానికుల నుంచి.. అదీ సొంత నియోజకవర్గం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా వేలాది ఎకరాల భూముల సేకరణ ప్రయత్నం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఇవీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చిన అంశాలు! చేపట్టాల్సిన అనేక ప్రజాప్రయోజన ప్రాజెక్టులను వదిలేసి కొండగల్ ఫార్మా క్లస్టర్పైనే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, నిరసనలు, తిరుగుబాట్లు, ఎదురుదాడులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులను మోహరించి పెద్దఎత్తున భూములు సేకరించే ప్రయత్నం చేస్తుండడం ఇటు ఫార్మా రంగ పెద్దలను కూడా ఆలోచనలో పడేసింది.
‘ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల కోసమే ఈ భూసేకరణ ప్రయత్నాలు’ అని కాంగ్రెస్‌లోని కొందరు నేతలే చెప్తుండడం విస్తుగొలుపుతున్నది. ముందుగా ఇక్కడ 1500 ఎకరాల్లోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలనుకొని భూసేకరణ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని 3వేల ఎకరాలకు పెంచాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ భూమే ఉండాలని చూస్తున్నట్టు సమాచారం. దగ్గరలో పేద రైతుల, గిరిజనుల భూములు ఉండడంతో వాటిని కూడా సేకరించాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. అదీగాక రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత వేగంగా పనులు జరుగుతున్న క్లస్టర్ కూడా కొడంగల్ ఫార్మా క్లస్టరేనని అధికారులే చెప్తున్నారు.
04
తక్కువ సమయంలోనే కంపెనీలు
సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కగానొక్క కూతురు నైమిషారెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన సత్యనారాయణరెడ్డి గొలుగూరితో పెళ్లయ్యింది. ఈ దంపతులు డైరెక్టర్లుగా కొన్ని కంపెనీలు ఉంటే, రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డి బంధువులు, ఆయన మిత్రులు డైరెక్టర్లుగా మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేశారు. నైమిషారెడ్డి, సత్యనారాయణరెడ్డి గొలుగూరి ఇద్ద రూ ‘గీతా ఆటోమోటివ్స్’ అనే సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. (గీత సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి పేరు).నైమిషారెడ్డి, సత్యనారాయణరెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా ‘క్యామెరాన్ ఫూడ్స్’ పేరుతో మరో కంపెనీ కూడా ఉన్నది. సత్యనారాయణరెడ్డి గొలుగూరి డైరెక్టర్‌గా ‘మ్యాక్స్బిన్ ఫార్మా’ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. ఇందులో దివ్య మయూర్ సింగం, వాసుబాబు వజ్జ, దుంప భరత్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీకి మాదాపూర్‌లో రిజిస్టర్డ్ ఆఫీసు ఉన్నట్టు చూపించారు. రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డి గొలుగూరి, ఆయన తండ్రి వెంకట్‌రెడ్డి గొలుగూరి, వీరి మరో కుటుంబసభ్యుడు రామకృష్ణారెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా ‘నియో ప్రైడ్ ఫార్మాస్యుటికల్స్’ పేరుతో మరో కంపెనీ ఏర్పాటు చేశారు.
రేవంత్‌రెడ్డి వియ్యంకుడు వెంకట్‌రెడ్డి గొలుగూరి ‘నెక్సెస్ ఫీడ్స్’, ‘నాన్సీ ఇండస్ట్రీస్ లిమిటెడ్’, ‘నొవాల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ‘ఎస్వీఎస్ ఫార్మా’, ‘ఆదిత్య నరసింహ ఫార్మసీ’, ‘హీల్ లైఫ్ హెల్త్’ పేరుతో మరిన్ని కంపెనీలు ఉండగా వీటిలో సత్యనారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి నేరుగా లేకపోయినా వీరి కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న బొమ్మ నరేందర్‌రెడ్డి, దుంప భరత్‌రెడ్డి, ప్రభావతి దుంప తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్లు డైరెక్టర్లుగా ఉన్న మరిన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి అ ల్లుడు, కుటుంబసభ్యులు, వారి స్నేహితులపేర్లతో ఉన్న కంపెనీలు దాదాపు 3 నుంచి 4 ఏండ్లలోనే పుట్టుకొచ్చాయని తెలుస్తున్నది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లో ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. ఆయా ఫార్మా కంపెనీలు ఇటీవల ఏర్పాటయ్యాయని, ఎలాంటి ఉత్పత్తికాని, వ్యాపారాలు కాని మొదలు పెట్టలేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. వీటిలో కొన్ని సూట్‌కేస్ కంపెనీలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ కంపెనీల ఏ ర్పాటు క్లిప్పింగ్‌లను జతచేస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘ఆయా కంపెనీల కోసమే సీఎం భూ సేకరణ ప్రయత్నాలు’ అని పేర్కొంటున్నారు. ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బంధువులు ముందునుంచే వ్యూహాత్మకం గా ఉన్నారని అటు ఫార్మావర్గాలతో పాటు, కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు.
సేకరణ పూర్తికాకుండానే రోడ్లు, విద్యుత్తు స్తంభాలు
కొడంగల్ ఫార్మా క్లస్టర్‌కు సంబంధించి భూ సేకరణ ఇంకా పూర్తికాకుండానే ప్రభుత్వం సర్వే నిర్వహించడం, లే అవుట్లు చేయడం, విద్యుత్తు స్తంభాలు వేయడం, రోడ్లు వేయడం లాంటి పనులు చేపట్టింది. దీనిద్వారా భూ సేకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని చెప్పకనే చెప్తున్నది. ప్రైవేట్‌గా రైతుల నుంచి భూములు సేకరించేముందు వారిలో భూములు ఇవ్వకతప్పదన్న భావన కల్పించేందుకు రోడ్లు, ఇతర పనులు కూడా సమాంతరంగా చేపట్టినట్టు తెలుస్తున్నది. వీలైనంత త్వరగా.. భూ సేకరణ పూర్తిచేయాలనే లక్ష్యంతో సీఎం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తున్నది. భూ సేకరణ ప్రక్రియ వేగంగా చేయాలని సీఎంవో నుంచి ఒత్తిడి ఉన్నట్టు కొన్ని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ఈ కంపెనీలు పుట్టింది ఎప్పుడు : 3-4 ఏండ్లలోనే * వీటిలో ఉత్పత్తి జరుగుతున్నదా? : లేదు వ్యాపారాలు సాగుతున్నాయా ?: లేదు * వీటిలో ఉన్న మరిన్ని సంస్థలు : సూట్‌కేస్ కంపెనీలు ఫార్మా క్లస్టర్లపై ముందునుంచే వ్యూహాత్మకం లక్ష్యం: వీలైనన్ని ప్రభుత్వ భూముల్లో పాగా