Telangana | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మాసిటీ రైతులు ఊహించని షాకిచ్చారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
ఫార్మా సిటీని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి, తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారని ప్రెస్‌నోట్‌లో ఫార్మా సిటీ రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మా సిటీని రద్దు చేయలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల భూములను కాపాడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే రైతులను భూములు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం, ఈ భూముల్లో కొత్త ప్రాజెక్టును నిర్మించలేరని స్పష్టం చేశారు.
ఫార్మా సిటీ కోసం చేసిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి భూసేకరణ చేస్తున్నామని చెప్పినప్పుడు.. కొత్త పర్యావరణ అనుమతులు పొంది, తిరిగి ప్రజా స్పందన చేసి భూసేకరణ చేయాలి.. కానీ ఇవేవీ ఈ ప్రభుత్వం చేయలేదని ఫార్మా సిటీ రైతులు తెలిపారు. కాబట్టి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనికితోడు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురమిద్దా గ్రామాలలో ప్రభుత్వం భూ సేకరణ చేయకూడదని హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. వివాదంలో ఉన్న ఈ భూములను అగ్ర నాయకులకు, పెట్టుబడిదారులకు కొత్త ఫ్యూచర్ సిటీ ప్రాంతం అని చూపించడం మోసమని మండిపడ్డారు.
ప్రభుత్వం స్థానిక రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిందని.. ప్రజా పాలన అంటూ పేపర్ యాడ్స్ ఇస్తూ తప్పుడు సందేశం చూపిస్తుందని ఫార్మా సిటీ రైతులు తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోస పోవొద్దంటూ గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫార్మా సిటీ రెసిస్టెన్స్ కమిటీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.