యాచారం, సెప్టెంబర్19: రంగారెడ్డి జిల్లా ఫార్మా బాధిత రైతులు శుక్రవారం నగరంలోని నాంపల్లి (సీసీఎల్ఏ) అథారిటీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ద్వారా రైతులు అందుకున్న నోటీసులను జడ్జికి అందజేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఫార్మాసిటీకి తీసుకున్న భూములకు గతంలోనే పరిహారం డబ్బులను అథారిటీలో జమచేశామని, మీరు ఎందుకు తీసుకోవడంలేదని, ఇంకా ఏమైనా పరిహారం ఎక్కువ కావాలా అని జడ్జి రైతులను అడిగారు. దీంతో ఫార్మాకు భూములు ఇవ్వలేదని, తమకు పరిహారం ఎందుకు ఇస్తున్నారని బాధిత రైతులు కళ్లెం లక్ష్మి, మర్రి సుభాష్‌రెడ్డి, ఉడుతల బాలమణి, కానమోని గణేశ్, ముత్యాల అనంతరెడ్డి ప్రశ్నించారు. అవార్డు రద్దు అయిన కాపీ, కోర్టు ఆర్డరు కాపీని సైతం జడ్జికి అందజేశారు.
హైకోర్టులో అవార్డు రద్దు అయి, కోర్టులో స్టే ఉండగా మళ్లీ నోటీసులు ఎలా పంపిస్తారని రైతులు నిలదీశారు. తమకు ప్రభుత్వ పరిహారం వద్దని, ప్రాణం పోయినా ప్రభుత్వానికి భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. అవసరమైతే ఉన్నత న్యాయ స్థానానికి వెళతామని స్పష్టంచేశారు. వృద్ధులను కోర్టు చుట్టూ తిప్పడం అధికారులకు ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.